Share News

విద్యుత్తు ఉద్యోగులకు డీఏ పెంపు

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:15 AM

విద్యుత్‌ ఉద్యోగులకు 1.621 శాతం డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వారి డీఏ 17.651 శాతం నుంచి 19.272 పెరిగింది.

విద్యుత్తు ఉద్యోగులకు డీఏ పెంపు

  • 1.621 శాతం పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం

  • 70,804 మంది ఉద్యోగులకు ప్రయోజనం

హైదరాబాద్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఉద్యోగులకు 1.621 శాతం డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వారి డీఏ 17.651 శాతం నుంచి 19.272 పెరిగింది. విద్యుత్‌ రంగ సంస్థల్లోని మొత్తం 70,804 మంది సిబ్బంది, పెన్షనర్లు డీఏ పెంపు వల్ల ప్రయోజనం పొందనున్నారు. దీని వల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.9.35 కోట్ల అదనపు భారం పడనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం విద్యుత్‌ సౌధలో ఇంధన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా డీఏ పెంచే ప్రతిపాదనకు ఈ సమావేశంలో భట్టి పచ్చజెండా ఊపారు. రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు సన్నద్ధం కావాలని భట్టి ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్‌ మౌలిక సదుపాయాలకు ప్రణాళికపై సూచనలు చేశారు. వేసవిలో రికార్డు స్థాయిలో డిమాండ్‌ తలెత్తినా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు.

Updated Date - Jun 18 , 2026 | 05:16 AM