Share News

త్వరలో ఐఏఎస్‌ల బదిలీలు.!

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:36 AM

రాష్ట్రంలో త్వరలో మరోసారి ఐఏఎ్‌సల బదిలీలు జరగనున్నాయి. ఈ మేరకు 10-12 మందితో జాబితా సిద్ధమవుతున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఇటీవలనే ప్రభుత్వం ఐఏఎస్‌లను బదిలీ చేసింది.

త్వరలో ఐఏఎస్‌ల బదిలీలు.!

  • 10 నుంచి 12 మందితో జాబితా సిద్ధం!

  • కొందరికి ఎఫ్‌ఏసీ, హోదాకు తగ్గ పోస్టింగుల్లో సర్దుబాట్లు

  • మరికొందరికి స్థాన చలనం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు జరగనున్నాయి. ఈ మేరకు 10-12 మందితో జాబితా సిద్ధమవుతున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఇటీవలనే ప్రభుత్వం ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అయితే అందులో కొందరికి పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ), మరికొందరికి హోదాకు తగ్గ పోస్టింగ్‌లు రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే ఇంకొంత మంది పనితీరు విషయంలో ప్రభుత్వం అసహనంగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హోదాకు తగ్గ పోస్టింగ్‌లు, ఒకటి, రెండు పోస్టింగ్‌ల్లో ఉన్న అధికారులకు ఒకే పోస్టింగ్‌ ఇవ్వడంతో పాటు పనితీరు బాగోలేని అధికారులకు స్థాన చలనం కలిగించనున్నట్టు తెలిసింది. ఎవరు ఏ విభాగం నుంచి, ఏ శాఖ నుంచి రిలీవ్‌ అవుతారోననే అంశంపై సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కేంద్ర సర్వీసులకు ఓ ఐఏఎస్‌.!

రాష్ట్రంలో ఓ శాఖకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ హోదాలో ఉన్న ఐఏఎస్‌ అధికారి త్వరలో కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నట్టు తెలిసింది. రాష్ట్ర సర్వీసులోకి రాకముందు ఆయన కేంద్రంలోనే ఉన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఆయన్ను కీలక శాఖ నుంచి తప్పించి, వేరే శాఖకు బదిలీ చేయడం, అదే సమయంలో కేంద్రంలోనూ ఆయనకు సెక్రటరీ హోదా గుర్తింపు రావడంతో కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వగానే ఆయన కేంద్ర సర్వీసులోకి వెళ్తారని, నీతిఆయోగ్‌కు వెళ్తారని సమాచారం.

ఆ ఐఏఎస్‌..‘స్పెషల్‌’.!

ఇటీవల కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌ పొందిన ఓ అధికారికి కేటాయించిన పోస్టింగ్‌ అంశం తాజాగా ఐఏఎస్‌ వర్గాలతో పాటు సచివాలయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా మూడంచెల్లో ఉద్యోగం నిర్వర్తించిన తరువాత రావాల్సిన హోదా, వెంటనే రావడంతో ఈ చర్చకు దారి తీసిందని సమాచారం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన కొంతమంది అధికారులను ‘కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌’లుగా ప్రకటించింది. అందులో 1990/1991కు చెందిన గ్రూప్‌-2 అధికారి కూడా ఉన్నారు. కన్‌ఫర్డ్‌ కాకముందు వరకు ఓ మంత్రి దగ్గర ఓఎస్డీగా విధుల్లో ఉన్నారు. కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌గా రాగానే, ఆయనకు ఓ కీలక శాఖలో ‘స్పెషల్‌ సెక్రటరీ’ పోస్టింగ్‌ ఇచ్చారు. కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌కు ‘స్పెషల్‌ సెక్రటరీ’ హోదా ఇవ్వడంపై అదే శాఖలో డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న మరో ఐఏఎస్‌ కినుక వహించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కన్‌ఫర్డ్‌ అధికారికి ‘స్పెషల్‌’ హోదా ఇచ్చి, డైరక్ట్‌ ఐఏఎస్‌గా ఉన్న తనకు డిప్యూటీ ఉంచడంపై అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దీంతో డిప్యూటీ సెక్రటరీ హోదా కాస్త స్పెషల్‌ సెక్రటరీగా మారింది.

Updated Date - Apr 07 , 2026 | 05:36 AM