Share News

మళ్లీ ఐఏఎస్‌ల బదిలీలు!

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:02 AM

రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు జరగనున్నాయి. శుక్ర, శనివారాల్లోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.

మళ్లీ ఐఏఎస్‌ల బదిలీలు!

  • నేడో, రేపో ఉత్తర్వులు.. కొంతమందికి స్థానచలనం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు జరగనున్నాయి. శుక్ర, శనివారాల్లోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ మేరకు 10-12 మందితో జాబితా సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో కేంద్ర జనగణన ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ ప్రక్రియ మొదలయ్యాక అది పూర్తయ్యేవరకు కలెక్టర్లు, ఇతర అధికారులు, ఉద్యోగుల బదిలీకి అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయంపై ఇటీవల కేంద్రం కూడా రాష్ట్రాలకు లేఖలు పంపింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాల కలెక్టర్లతోపాటు రాష్ట్రస్థాయిలో పనిచేసే కొంత మంది ఐఏఎస్‌లను బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 11, 25వ తేదీల్లో పలువురు ఐఏఎ్‌సలను బదిలీచేయడంతో పాటు ఎఫ్‌ఏసీ పోస్టింగ్‌లను కేటాయించింది. అందులో కొందరికి పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ), మరికొందరికి హోదాకు తగ్గ పోస్టింగ్‌లు రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే కొందరి పనితీరు విషయంలో ప్రభుత్వం అసహనంగా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హోదాకు తగ్గ పోస్టింగ్‌లు, ఒకటి, రెండు పోస్టింగ్‌ల్లో ఉన్న అధికారులకు ఒకే పోస్టింగ్‌ ఇవ్వడంతోపాటు పనితీరు బాగోలేని అధికారులకు స్థాన చలనం కలిగించనున్నట్టు తెలిసింది. జహీరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ మారనున్నట్టు తెలిసింది.

Updated Date - Apr 24 , 2026 | 04:02 AM