స్వతంత్రంగా కిడ్నాపులు!
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:46 AM
పలు చోట్ల హైడ్రామా.. ఉద్రిక్తత.. జనగామ స్వతంత్ర కౌన్సిలర్ కోసం భువనగిరిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గలాటా.. ఇస్నాపూర్, వర్ధన్నపేట, పరిగిల్లోనూ అంతే..
హంగ్ వచ్చిన చోట ఇండిపెండెంట్ కౌన్సిలర్లను ఎత్తుకుపోయిన పార్టీలు
పలు చోట్ల హైడ్రామా.. ఉద్రిక్తత.. జనగామ స్వతంత్ర కౌన్సిలర్ కోసం భువనగిరిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గలాటా.. ఇస్నాపూర్, వర్ధన్నపేట, పరిగిల్లోనూ అంతే..
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు వచ్చినచోట స్వతంత్ర కౌన్సిలర్ల కోసం పార్టీలు వేట మొదలుపెట్టాయి. అటు ఫలితాలు వెలువడుతుండగానే.. ఇటు ఇండిపెండెంట్ కౌన్సిలర్లను ఎత్తుకుపోయి, తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. అవతలిపక్షం కూడా ఇదే పనిలో ఉండటంతో రాజకీయం రసాభాసగా మారింది. జనగామ జిల్లా మునిసిపల్ క్యాంపు రాజకీయం భువనగిరిలోని ఓ హోటల్ వద్ద హైడ్రామాకు దారితీసింది. జనగామ మునిసిపాలిటీలో 30వార్డులకుగాను బీఆర్‌ఎస్ 13, కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐ కలిపి 13 స్థానాలు గెలిచాయి.
మరో నలుగురు స్వతంత్రులు గెలిచారు. మున్సిపల్ పీఠం దక్కించుకోవడానికి ఇండిపెండెంట్ల మద్దతు కీలకంగా మారింది. కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు 23వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన బూష పర్వతాలును కారులో ఎక్కించుకుని హైదరాబాద్ వైపు బయలుదేరారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి సమాచారమిచ్చి.. భువనగిరి శివార్లలో హైదరాబాద్-వరంగల్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక హోటల్ వద్ద ఆగారు. ఎంపీ చామల కిరణ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అక్కడికి చేరుకుని పర్వతాలుతో మాట్లాడి, కాంగ్రె్‌సకు మద్దతివ్వాలని కోరారు. ఈ విషయం తెలిసిన జనగామ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భువనగిరిలోని హోటల్ వద్దకు చేరుకున్నారు.
పోలీసులు అడ్డుకోగా, తమ మద్దతుదారును కాంగ్రెస్ నేతలు బలవంతంగా నిర్బంధించారని, అతడిని కలవనివ్వాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడం, పరస్పర వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి జిల్లా అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ పర్వతాలుతో మాట్లాడి, ఆయన కోరిన మేరకు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పంపించారు.
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో 26 వార్డులు ఉండగా 12 స్థానాల్లో బీఆర్‌ఎస్, 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. 4 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అందులో ఇద్దరు బీఆర్‌ఎస్ రెబల్స్, ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. మున్సిపల్ పీఠం కోసం స్వతంత్రులే కీలకం కావడంతో.. కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచే వారిని తమ శిబిరంలోకి తీసుకెళ్లేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పరస్పరం దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఆ గందరగోళం మధ్యే స్వతంత్ర అభ్యర్థులలో ఇద్దరిని ఒక పార్టీ, మరో ఇద్దరిని ఇంకో పార్టీ తమ శిబిరాలకు తరలించినట్టు తెలిసింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట 5 వార్డులో స్వతంత్ర అభ్యర్థి నేతావత్ శోభారాణి గెలిచారు. ఓట్ల లెక్కింపు తర్వాత ఆమెను కాంగ్రెస్ నాయకులు బెదిరించి తీసుకెళ్లారంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు క్యాంపు కార్యాలయం ఎదుట, వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై తండావాసులు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆరూరి రమేశ్, ఇతర నేతలను అదుపులోకి తీసుకుని, ఆందోళనకారులను చెదరగొట్టారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో 18 వార్డులుండగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెరో 8 చోట్ల గెలవగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. దీనితో స్వతంత్ర అభ్యర్థుల కోసం ఇరు పార్టీల నేతలు పోటీపడ్డారు. ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటికి వస్తుండగానే స్వతంత్ర కౌన్సిలర్ హన్మంత్‌ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి హన్మంత్‌ను ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి తీసుకెళ్లారు. దీనితో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. తాను వార్డు ప్రజలతో మాట్లాడి, నిర్ణయం తీసుకుంటానని హన్మంత్ చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. ఇక మరో స్వతంత్ర కౌన్సిలర్ కుర్వ అక్కమ్మను బీఆర్‌ఎస్ నాయకులు తమ క్యాంపునకు తరలించారు. అయితే ఆమె కుమారుడు బాలరాజు తన తల్లిని బీఆర్‌ఎస్ నేతలు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో స్వతంత్ర కౌన్సిలర్‌గా విజయం సాధించిన సారా లావణ్యను కాంగ్రెస్ నేతలు తమ క్యాంపునకు తరలించేందుకు ప్రయత్నించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్ సమతాకాశిరెడ్డిని తమ క్యాంపునకు తరలించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. బీఆర్‌ఎస్ నేతలు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. సమతాకాశిరెడ్డిని బీఆర్‌ఎస్ నాయకులు తమ క్యాంపునకు తరలించారు.