Share News

చిన్నారిపై వీధికుక్కల దాడి, వృద్ధురాలి దయనీయ స్థితిపై హెచ్‌ఆర్సీ సీరియస్‌

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:52 AM

వరంగల్‌లో రెండేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడితో పాటు, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఓ వృద్ధురాలు రోడ్డుపైనే దయనీయ పరిస్థితుల్లో ...

చిన్నారిపై వీధికుక్కల దాడి, వృద్ధురాలి దయనీయ స్థితిపై హెచ్‌ఆర్సీ సీరియస్‌

  • సుమోటోగా విచారణకు స్వీకరణ

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లో రెండేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడితో పాటు, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఓ వృద్ధురాలు రోడ్డుపైనే దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్న ఘటనలపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ఆర్‌సీ) స్పందించింది. దినపత్రికల్లో శనివారం ప్రచురితమైన వార్తా కథనాల ఆధారంగా ఆయా కేసులను సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కమిషన్‌ సభ్యురాలు శివాడి ప్రవీణ సంబంధిత జిల్లా కలెక్టర్ల నుంచి సమగ్ర నివేదికలు కోరారు. వీధి కుక్కల దాడులతో చిన్నారుల భద్రత, జీవన హక్కులపై కమిషన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి, అందించిన వైద్య సహాయం, వీధికుక్కల నియంత్రణ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. శారీరక ఇబ్బందులతో బాధపడుతూ దాతల సాయంపై ఆధారపడుతున్న ఆ వృద్ధురాలి పరిస్థితి వృద్ధుల సంక్షేమం, సంరక్షణ, గౌరవప్రదమైన జీవన హక్కులకు సంబంధించిన అంశమని కమిషన్‌ అభిప్రాయపడింది. ఆమెను, ఆమె కుటుంబసభ్యులను గుర్తించడం, ఆమెకు చికిత్స అందించి పునరావాసం కల్పించడం తదితర చర్యలపై నివేదిక ఇవ్వాలని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు కేసుల విచారణను జూలై 20కి వాయిదా వేసింది.

Updated Date - Jun 21 , 2026 | 04:52 AM