Share News

ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ మృతి ఘటనపై.. సుమోటోగా హెచ్‌ఆర్సీ విచారణ

ABN , Publish Date - Jun 18 , 2026 | 05:53 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి, నవజాత శిశువు మరణించిన ఘటనను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(టీజీ హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది.

ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ మృతి ఘటనపై.. సుమోటోగా హెచ్‌ఆర్సీ విచారణ

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి, నవజాత శిశువు మరణించిన ఘటనను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(టీజీ హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది. కమిషన్‌ న్యాయ సభ్యురాలు శివాడి ప్రవీణ ఈ అంశాన్ని స్వయంగా పరిగణనలోకి తీసుకున్నారు. దినపత్రికల్లో బుధవారం ప్రచురితమైన వార్తలను ఆధారంగా తీసుకుని విచారణకు ఆదేశించారు. శంభునిగూడెం గ్రామానికి చెందిన దట్ల వనజ(20) ప్రసవ వేదనతో గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, విధుల్లో ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో నర్సే ప్రసవం నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయని కమిషన్‌ పేర్కొంది. పుట్టిన వెంటనే శిశువు మృతి చెందగా, ఆ తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి కూడా మరణించినట్లు వెల్లడించింది. ఈ ఆరోపణలు నిజమైతే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో రోగుల జీవించే హక్కు, సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు పొందే హక్కు ఉల్లంఘనకు గురైనట్టేనని కమిషన్‌ అభిప్రాయపడింది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, వాస్తవాలు, బాధ్యులపై తీసుకున్న చర్యల వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్‌వోను ఆదేశించింది. జూలై 13లోగా నివేదిక అందజేయాలని కమిషన్‌ స్పష్టం చేసింది.

Updated Date - Jun 18 , 2026 | 05:55 AM