ఇళ్ల కోసం మరో పోరాటం: కూనంనేని
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:56 AM
రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు దక్కేలా సమరశీల పోరాటాలకు సన్నద్దం కావాలని వామపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ...
సురవరం భవన్‌ను కూలగొట్టడం దుర్మార్గమైన చర్య : పల్లా వెంకట్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు దక్కేలా సమరశీల పోరాటాలకు సన్నద్దం కావాలని వామపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం జూలై 1న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్ల ముందు పెద్దఎత్తున ముట్టడి, నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదల నుంచి దరఖాస్తులను సేకరించి జూలై 6న హైదరాబాద్‌లో(ఇందిరాపార్క్) వేలాది మందితో ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సేకరించిన దరఖాస్తులను సమర్పిస్తామన్నారు. ఆ తర్వాత ఆయ న స్పందన మేరకు తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. ‘హనుమకొండ శివారు గుండ్లసింగారంలో నాలుగేళ్లుగా నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే అధికారులు, పోలీసులు దొంగల మాదిరిగా అర్ధరాత్రి సమయంలో గ్రామంపై పడి వాటిని కూల్చివేయడం దుర్మార్గం’ అని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా బలవంతంగా లాగిపడేసి అడ్డం వచ్చిన యువకులు, వృద్ధుల కాళ్లు చేతులు మడిచి మరీ బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి, అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మాట తప్పిందన్నారు. గుడిసెలు వేసుకున్న పేదలపై ప్రతాపం చూపించడం సరికాదన్నారు. గుండ్లసింగారంలోనే ఉన్న సురవరం భవన్‌ను కూలగొట్టడం దుర్మార్గమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.