Minister Ponguleti Srinivas Reddy: గతంలో గులాబీ చొక్కాలకే ఇళ్ల పట్టాలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:55 AM
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పింక్ కలర్ షర్ట్ ఉన్నవారికే ఇళ్ల పట్టాలిచ్చారు. ఏటా పేద వర్గాలకు లక్ష ఇళ్లు కట్టినా పదేళ్లలో పది లక్షల ఇళ్లు ఇచ్చే అవకాశం ఉండేది....
పేదల ఇళ్లు కడితే కమీషన్లు రావనే కట్టలేదు
ఏప్రిల్‌లో కొత్త ఇళ్లు ప్రకటిస్తాం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ‘బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పింక్ కలర్ షర్ట్ ఉన్నవారికే ఇళ్ల పట్టాలిచ్చారు. ఏటా పేద వర్గాలకు లక్ష ఇళ్లు కట్టినా పదేళ్లలో పది లక్షల ఇళ్లు ఇచ్చే అవకాశం ఉండేది. కాళేశ్వరంలో పంపులు/మోటార్లు పెడితే కమీషన్లు వస్తాయి. పేదల ఇళ్లు కడితే కమీషన్లు రావనే ఇళ్లు కట్టలేదు’ అని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో పేద వర్గాలకు ఆత్మగౌరవంగా ఇందిరమ్మ ఇళ్లు మారిందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపేరుతో మభ్యపెట్టిందని, రూ.204 కోట్ల బకాయిలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీర్చిందని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న ఇళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.744 కోట్లు వెచ్చించామని చెప్పారు. 12-13 వేల ఇళ్లు మొండిగోడలతో ఉన్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ప్రక్రియ నిరంతరం జరుగుతుందని, ఇప్పటికే ఒక విడత ఇళ్లు మంజూరు చేయగా.. మరో మూడు విడతలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. వచ్చే ఏప్రిల్‌లో కొత్త ఇళ్లను ప్రకటిస్తామని మంత్రి ప్రకటించారు. ‘తొలి విడతలో మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లలో సుమారు 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. సుమారు 52 వేల ఇళ్లలో గృహప్రవేశాలు జరిగాయి. వచ్చే వర్షాకాలంలోగా తొలి విడత ఇళ్ల్ల నిర్మాణం పూర్తవుతుంది. రాష్ట్రంలో 133 కాలనీల్లో 36వేల ఇళ్లు మొండిగోడలతో మిగిలిపోయాయి. కొన్ని డబుల్ ఇళ్లు కట్టి ఎవరికీ కేటాయించలేదు. అసంపూర్తి ఇళ్ల కోసం రూ.455 కోట్లు మంజూరు చేశాం. వీటిని అర్హులకు అందజేస్తాం’ అని మంత్రి తెలిపారు. జీహెచ్‌ఎంసీలో గృహ నిర్మాణానికి స్థలాలను గుర్తించి మంజూరు చేస్తామన్నారు. డబుల్ ఇళ్ల సమస్య తమ నియోజకవర్గం(వికారాబాద్)లోనూ ఉందని, అందరు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా వారం, పది రోజుల్లో సమావేశం నిర్వహించి వాళ్ల సమస్యలను పరిష్కరించాలని స్పీకర్ ప్రసాద్ అన్నారు. కాగా, ధరణి స్లాట్ బుకింగ్ చేసుకుని.. తిరస్కరణ అయిన దరఖాస్తుదారులకు ఇప్పటి వరకు రూ.12,97,95,407కోట్లు రిఫండ్‌చేశామని పొంగులేటి తెలిపారు. మిగిలిన రూ.87,60,34,327 కు సంబంధించి.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో కొన్ని అవకతవకలు జరిగాయని.. అందువల్లనే రూ.122 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.