ఐపీహెచ్‌ఎస్ ప్రమాణాలతో దవాఖానాలు
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:49 AM
రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు ఇండియన్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాల(ఐపీహెచ్‌ఎస్)కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు ...
ప్రణాళికల రూపకల్పన.. హెచ్‌వోడీలు వారంలో ఒకరోజైనా ఫీల్డ్‌విజిట్ చేయాలి: దామోదర
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు ఇండియన్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాల(ఐపీహెచ్‌ఎస్)కు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్- డీసీహెచ్‌ఎస్) బలోపేతం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశం శుక్రవారం సచివాలయంలో దామోదర అధ్యక్షతన జరిగింది. గతంలో టీవీవీపీ పరిధిలోని 30 ఆస్పత్రులు మెడికల్ కాలేజీలకు అనుబంధ టీచింగ్ ఆస్పత్రులుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఈ ఆస్పత్రులకు మంజూరైన పోస్టులను, టీవీవీపీ పరిధిలోని ఇతర ఆస్పత్రులకు కేటాయించడంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేషెంట్లకు వారి నివాసాలకు సమీపంలోనే, వారి సొంత జిల్లాలోనే ట్రీట్‌మెంట్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని, ఇందుకు అనుగుణంగా సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. ఐపీహెచ్‌ఎ్‌స అనుగుణంగా అన్ని ఆస్పత్రుల్లో హెచ్‌ఆర్, మౌలిక సదుపాయాలు, పరికరాలు, డయాగ్నస్టిక్స్, ఔషదాలు ఉండాలని, ఇందుకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి సూచించారు. టీవీవీపీ పోస్టులు, వైద్య సిబ్బందిని రీడిప్లాయ్‌మెంట్ చేసేటప్పుడు ఐపీహెచ్‌ఎస్ నిబంధనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఈ రెండేళ్లలోనే ఆస్పత్రుల్లో 12,649 పోస్టులను భర్తీ చేశామని మంత్రి పేర్కొన్నారు. వైద్యులు, ఇతర సిబ్బంది హాజరును క్షుణ్ణంగా పర్యవేక్షించాలని, వారంలో కనీసం ఒకరోజు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని వీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్‌కు మంత్రి సూచించారు. డ్యూటీలకు గైరా?జరయ్యే వారిపై కఠినంగా వ్యవహరించాలని కమిషనర్‌ను ఆదేశించారు.