Share News

భవనాలు సరే.. వైద్యులేరి

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:14 AM

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖను మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు ఉన్నారా? లేదా? అన్నది దృష్టిలో పెట్టుకోకుండా ఎడాపెడా వైద్యకళాశాలలను ఏర్పాటు చేయడమే అసలు సమస్యగా మారింది.

భవనాలు సరే.. వైద్యులేరి

  • రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కాలేజీల్లో స్పెషలిస్టు డాక్టర్లకు తీవ్ర కొరత

  • 4 వేల మంది వైద్య నిపుణులు అవసరం

  • మెడికల్‌ కాలేజీల్లో 61 శాతం ఖాళీలే

  • రాష్ట్రంలో కొత్తగా 3 టిమ్స్‌ ఆస్పత్రులు

  • 600 మంది స్పెషాలిటీ డాక్టర్లు అవసరం

  • నోటిఫికేషన్లు ఇస్తున్నా భర్తీ కాని పోస్టులు

  • వేతనాలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇస్తే

  • పరిస్థితి మారవచ్చంటున్న వైద్య నిపుణులు

హైదరాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖను మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు ఉన్నారా? లేదా? అన్నది దృష్టిలో పెట్టుకోకుండా ఎడాపెడా వైద్యకళాశాలలను ఏర్పాటు చేయడమే అసలు సమస్యగా మారింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఏకంగా 61 శాతం స్పెషలిస్టు వైద్యుల కొరత ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గత బీఆర్‌ఎస్‌ హయాంలో అప్పటికే ఉన్న మెడికల్‌ కాలేజీల్లోనే స్పెషలిస్టు వైద్యుల కొరత ఉంటే.. దానికి తోడు వరుసగా మూడేళ్లలో ఏకంగా 25 కొత్త మెడికల్‌ కాలేజీలకు అనుమతినిస్తూ జీవోలు జారీ చేశారు. నాటి సర్కారు అనాలోచిత నిర్ణయమే నేటి పాలకులకు గుదిబండగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, రాష్ట్రంలో ఓ ప్రణాళిక లేకుండా ఆస్పత్రులను నిర్మించారు. ఒక ప్రాంత ప్రజాప్రతినిధి పట్టుబడితే చాలు.. దవాఖానాలను మంజూరు చేశారు. కానీ వాటిలో వైద్యులు, సిబ్బంది, ఔషధాలు, యంత్రపరికరాల గురించి పట్టించుకోలేదు. మెడికల్‌ కాలేజీల్లో ప్రస్తుతం అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల కొరత 66 శాతం, అసోసియేట్‌ ప్రొఫెసర్ల కొరత 69 శాతం, ప్రొఫెసర్ల కొరత 39 శాతం ఉంది. వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని 35 మెడికల్‌ కాలేజీల్లో 6,559 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ 2,556 మందే పనిచేస్తున్నారు. 4,003పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు పిలిచి ఉద్యోగాలిస్తామంటున్నా స్పెషలిస్టు వైద్యులు దొరకడం లేదు. గతేడాది 34 స్పెషాలిటీ విభాగాల్లో 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల కోసం మెడికల్‌ బోర్డు నోటిషికేషన్‌ జారీ చేసింది.


వాటి భర్తీ ప్రక్రియ ముగిసింది. 607 పోస్టులకుగాను 344 పోస్టులే భర్తీ అయ్యాయి. మిగిలిన 263 పోస్టులకు అర్హులైన అభ్యర్థులే దొరకలేదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు. కానీ అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టులను పదోన్నతుల ఆధారంగానే భర్తీ చేయాలి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పదోన్నతిపై అసోసియేట్‌ అవుతారు. అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రమోషన్స్‌పై ప్రొఫెసర్‌గా పదోన్నతి దక్కుతుంది. అసలు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లే దొరకనప్పుడు అసోసియేట్‌, ప్రొఫెసర్లు ఎలా వస్తారు? ఒకవేళ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు లభ్యమైనా.. వారికి పదోన్నతులివ్వాలంటే నిబంధనల మేరకు నాలుగేళ్లు ఆగాలి. అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలన్నా అందుబాటులో లేని పరిస్థితి, రెగ్యులర్‌ అధ్యాపకుల కంటే అధిక వేతనాలిస్తామన్న దొరకని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. పలుమార్లు నోటిఫికేషన్‌ ఇస్తున్నా పెద్దగా ఉపయోగం ఉండటం లేదు.


మూలిగే నక్కపై తాటిపండులా టిమ్స్‌ ఆస్పత్రులు

గత బీఆర్‌ఎస్‌ సర్కారు హైదరాబాద్‌లో కొత్తగా 3టిమ్స్‌ ఆస్పత్రులకు శంకుస్థాపన చేయగా.. తాజాగా సనత్‌నగర్‌ టిమ్స్‌ నిర్మాణం పూర్తయ్యింది. మూడు టిమ్స్‌లలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు వైద్య సేవలందిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. అయితే వీటిలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు ఎలా దొరుకుతారు అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. సర్కారు ఇచ్చే వేతనాలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం సనత్‌నగర్‌ టిమ్స్‌కు కనీసం 300 మంది సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు అవసరం అవుతారని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఇందులో 100 మంది వరకు సూపర్‌ స్పెషాలిటీ సర్జన్లు కావాల్సి ఉంటుందంటున్నారు. వైద్యుల కొరత కారణంగా ఎల్‌బీనగర్‌, అల్వాల్‌ టిమ్స్‌లను మెడికల్‌ కాలేజీలుగా మార్చారు. వెయ్యి బెడ్స్‌లలో 300 మెడికల్‌ కాలేజీకి, మిగిలిన 700 బెడ్లను సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలకు కేటాయిస్తున్నారు. దాంతో ఒకటి రెండేళ్లలో ఆ 2టిమ్స్‌కు మరో 300 మంది వరకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు అవసరమవుతారని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా అటు మెడికల్‌ కాలేజీల్లోనూ, ఇటు టిమ్స్‌లలో కలపి 4600 మంది వరకు స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు కావాలి. అంతమందిని ఏ విధంగా రిక్రూట్‌ చేస్తారో వేచి చూడాలి.


ఖాళీలు ఏర్పడగానే నోటిఫికేషన్లు ఇవ్వాలి!

మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు భర్తీ కాకపోవడానికి ప్రధాన కారణం వేతనాలు తక్కువగా ఉండటం. దీనికితోడు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సి రావడం. అలాగే పోస్టుల భర్తీకి తరచూ నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడం. ప్రతిసారి కొత్త పోస్టుల అనుమతికి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్‌ కోసం ఎదురు చూడటం. ఈ సమస్యలను పరిష్కరిస్తే నియామక ప్రక్రియ సులభతరమవుతుందని వైద్యవిద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతా ల్లో పని చేసే వారికి ప్రత్యేక ప్రోత్సాహక నగదును ఇవ్వాలని సూచిస్తున్నారు. ఖాళీలు ఏర్పడగానే వెంటనే వాటి భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేయాలని, ఆర్థికశాఖ ఆమోదం వచ్చే వరకు ఆగే పరిస్థితి ఉండవద్దని చెబుతున్నారు. ఏపీలో ఖాళీ పోస్టుల నియామకం కోసం అక్కడి సర్కారు ఒక ప్రత్యేక జీవో జారీ చేసింది. వైద్యులు, సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్ల నియామకం కోసం ఆర్థికశాఖ అనుమతి అక్కర్లేదని, భర్తీ తర్వాత ఆర్థికశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందని అందులో పేర్కొంది. దాంతో ఖాళీ ఏర్పడగానే నోటిఫికేషన్స్‌ ఇస్తున్నారు. అలాగే ఒడిశాలో గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే స్పెషలిస్టు డాక్టర్లకు వేతనాలకు అదనంగా మరో 50 శాతం ఇన్సెంటివ్‌ రూపంలో ఇస్తున్నారు. దాంతో అక్కడ వైద్యుల భర్తీ 20-30 శాతం పెరిగింది. అటువంటి విధానాన్నే తెలంగాణలోనూ అమలు చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - Jul 11 , 2026 | 06:14 AM