Share News

ఆరు రోజుల పసికందు అపహరణకు యత్నం

ABN , Publish Date - Apr 09 , 2026 | 07:10 AM

ఆరు రోజుల మగ శిశువును ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఎత్తుకెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వెంటాడి పట్టుకున్నారు.

ఆరు రోజుల పసికందు అపహరణకు యత్నం

  • 4 కి.మీ. బైక్‌పై వెంటాడి పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది

  • జనగామ శివారులోని ఎంసీహెచ్‌లో కలకలం

జనగామ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఆరు రోజుల మగ శిశువును ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఎత్తుకెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వెంటాడి పట్టుకున్నారు. బుధవారం జనగామ శివారు చంపక్‌హిల్స్‌లోని మాతాశిశు ఆస్పత్రి (ఎంసీహెచ్‌)లో రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖ్‌పూర్‌కు చెందిన చామంతుల కీర్తన ఈనెల 2న మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు కామెర్ల లక్షణాలు ఉండడంతో వైద్యులు ప్రత్యేక నవజాత సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన తాళ్లపల్లి జ్యోతి మొదటి భర్త మరణించగా.. రెండో పెళ్లి చేసుకుంది. మొదటి భర్తతో ఇద్దరు ఆడ పిల్లలుండగా.. రెండో వివాహం తర్వాత పిల్లలు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఎంసీహెచ్‌లో మగ శిశువును ఎత్తుకెళ్లేందుకు ప్లాన్‌ చేసింది. కీర్తన తమ బంధువేనంటూ ఎస్‌ఎన్‌సీయూ లోపలికి వెళ్లింది. శిశువుకు డైపర్‌ మార్చుతానంటూ పసికందును తీసుకొని అక్కడి నుంచి నేరుగా బయటకు వచ్చింది. ఓ ఆటోలో బాబును తీసుకొని జనగామ వైపు బయలుదేరింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ ఆశా కార్యకర్తకు అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బందికి విషయం చెప్పింది. ఇటు బాబు తండ్రి కరుణాకర్‌ కూడా ఆమె ఎవరో తెలియదని చెప్పాడు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ అమృత్‌, సిబ్బందితో కలిసి బైక్‌పై ఆటోను 4 కిలోమీటర్లు వెంబడించి శామీర్‌పేటలోని ఫంక్షన్‌హాల్‌ వద్ద అడ్డుకున్నారు. బాబును ఎందుకు తీసుకెళ్తున్నావని వారు ప్రశ్నించగా.. జ్యోతి తన బాబేనంటూ బుకాయించింది. దీంతో వారు ఆమెను పసికందుతో సహా ఎంసీహెచ్‌కు తీసుకువచ్చారు. ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు ఆమెను చితకబాదారు. పరిస్థితి ఉదిక్త్రంగా మారడంతో సీఐ సత్యనారాయణరెడ్డి కానిస్టేబుళ్లతో వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కిడ్నా్‌పకు యత్నించిన మహిళను పోలీస్ స్టేషన్ కు తరలించారు. శిశువు తండ్రి కరుణాకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 09 , 2026 | 07:11 AM