Share News

భూముల విలువ పెరిగినా ‘హిల్ట్‌’కు రాయితీ!

ABN , Publish Date - May 23 , 2026 | 05:34 AM

హైదరాబాద్‌ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం-2025 (హిల్ట్‌)ను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సరికొత్త వెసులుబాటును కల్పించాలని నిర్ణయించింది.

భూముల విలువ పెరిగినా ‘హిల్ట్‌’కు రాయితీ!

  • జూన్‌ నెలాఖరు వరకూ పాత విలువలే వర్తింపు

  • హిల్ట్‌ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ పారిశ్రామిక భూముల మార్పిడి విధానం-2025 (హిల్ట్‌)ను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సరికొత్త వెసులుబాటును కల్పించాలని నిర్ణయించింది. ఈ నెలలోనే రాష్ట్రంలోని భూముల రిజిస్ట్రేషన్ల విలువల పెంపు ఖరారైన నేపథ్యంలో.. ఆ పెంపు నుంచి హిల్ట్‌ కింద దరఖాస్తు చేసుకున్న వారికి మినహాయింపు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు మొత్తం పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను రెండ్రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. బాలానగర్‌, కాటేదాన్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, జీడిమెట్ల తదితర 22 పారిశ్రామికవాడల్లోని 9,292 ఎకరాల్లో ఉన్న పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ వెలుపలకు తరలించడం హిల్ట్‌ పాలసీ ప్రధాన ఉద్దేశం. ఖాళీ అయ్యే 9,292 ఎకరాలను వాణిజ్య, నివాస భవనాలు, విద్యాసంస్థలు మొదలైనవాటితో బహుళ వినియోగ జోన్లుగా మారుస్తారు. ఈ పాలసీని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతేకాదు, భూముల మార్పిడికి పరిశ్రమల యజమానులు పెద్దగా ముందుకు రాలేదు. కంపెనీలు ఉన్న భూములన్నీ తమ సొంతమని, వాటిని 30-40 ఏళ్ల క్రితమే తీసుకున్నామని చెప్పారు. హిల్ట్‌ పాలసీ కింద ప్రభుత్వం పేర్కొన్న ‘డెవల్‌పమెంట్‌ ఇంపాక్ట్‌ ఫీజు’ కూడా చాలా ఎక్కువగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశమై ఈ అంశం మీద చర్చించింది. పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ అవతలకు తరలించేందుకు వీలుగా హిల్ట్‌పాలసీ మార్గదర్శకాలను ఖరారు చేసినట్లు సమాచారం. దీంట్లో భాగంగా.. జూన్‌ నెలాఖరు వరకు హిల్ట్‌ పాలసీ కింద దరఖాస్తు చేసుకునే వారికి పాత మార్కెట్‌ విలువలతోనే లెక్కించిన డెవల్‌పమెంట్‌ ఇంపాక్ట్‌ ఫీజును చెల్లించేలా వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ ధరల వల్ల ‘డెవల్‌పమెంట్‌ ఇంపాక్ట్‌ ఫీజు’ పెరగకుండా ఈ మినహాయింపు ఇవ్వనున్నారు. ఓఆర్‌ఆర్‌ బయట ఉన్న పారిశ్రామిక లే అవుట్‌లలో ఈ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఓఆర్‌ఆర్‌ అవతలకు పరిశ్రమలను తరలిస్తే.. ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్లేలా కొన్ని రాయితీలు కల్పించాలన్న నిర్ణయాన్ని కూడా ఉపసంఘం తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - May 23 , 2026 | 05:34 AM