Share News

సొంత భూములకే హిల్ట్‌

ABN , Publish Date - May 24 , 2026 | 04:26 AM

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) పరిధిలోపు పారిశ్రామిక భూముల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

సొంత భూములకే హిల్ట్‌

  • దరఖాస్తుతో పాటు 10 శాతం ఫీజు.. మిగతాది 2 వాయిదాల్లో చెల్లించాలి

  • దానికి మొత్తం గడువు 3 నెలలు

  • 21 పారిశ్రామిక పార్కులు, స్టాండ్‌ అలోన్‌ భూములకు హిల్ట్‌ వర్తింపు

  • ప్రభుత్వ రంగ సంస్థలకు నో చాన్స్‌

  • జూన్‌ 30లోపు దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రేషన్‌ విలువ పెరిగినా మినహాయింపు

  • దరఖాస్తుల పరిశీలనకు రెండు కమిటీలు

  • దరఖాస్తు పోర్టల్‌, హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) పరిధిలోపు పారిశ్రామిక భూముల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పరిశ్రమల కోసం కేటాయించిన భూములను ఇకపై వాణిజ్య, నివాస, రెండు అవసరాలకూ కలిపి (మిక్స్‌డ్‌ యూజ్‌) మార్చుకునేలా ‘హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (హిల్ట్‌)’ విధానం అమలుకు పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని మొత్తం 21 ఇండస్ట్రియల్‌ పార్కుల్లో ఉండి సేల్‌డీడ్‌, సొంత భూములు కలిగిన పరిశ్రమలకే ఈ విధానం వర్తించనుంది. ఏపీఐఐసీ/టీజీఐఐసీ, ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ సంస్థలు పరిశ్రమల కోసం కేటాయించిన స్టాండ్‌ అలోన్‌ పారిశ్రామిక భూములు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎ్‌సయూలకు) కేటాయించిన భూములను మినహాయించారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ జారీచేసిన జీవో నెం.18 ప్రకారం ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో సాగనుంది. గతంలో విడుదల చేసిన జీవో నెం.27కు కొనసాగింపుగా ఈ మార్గదర్శకాలు రూపొందించారు. ఈ విధానం అమలుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)ను ప్రభుత్వం నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. దరఖాస్తుల పరిశీలనకు టీజీఐఐసీ స్థాయిలో రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసింది. టీమ్‌-1 పరిధిలో నాచారం, మల్లాపూర్‌, చర్లపల్లి, మౌలాలి, ఉప్పల్‌, సనత్‌నగర్‌, మేడ్చల్‌, కుషాయిగూడ, పటాన్‌చెరు, హయత్‌నగర్‌తో పాటు స్టాండ్‌ అలోన్‌ యూనిట్లు ఉంటాయి. టీమ్‌-2 పరిధిలో కూకట్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, గాంధీనగర్‌, పాశమైలారం, రామచంద్రాపురం, చందులాల్‌ బరాదరి, కాటేదాన్‌ తదితర పార్కులు ఉన్నాయి.

డీఐఎఫ్‌ ఇలా..!

ముందుగా ప్రతి పారిశ్రామిక పార్కు లేఅవుట్‌ను ఇండస్ట్రియల్‌ నుంచి మల్టీ యూజ్‌గా మార్చేందుకు టీజీఐఐసీ హెచ్‌ఎండీఏకు ప్రతిపాదనలు పంపుతుంది. అనంతరం భూ వినియోగ మార్పుపై హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. ఆ తర్వాత టీజీఐఐసీ పోర్టల్‌లో కామన్‌ అప్లికేషన్‌ ఫారం (సీఏఎఫ్‌) ద్వారా దరఖాస్తు చేయాలి. జీవో 27 ప్రకారం డెవల్‌పమెంట్‌ ఇంపాక్ట్‌ ఫీజు(డీఐఎ్‌ఫ)ను ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విలువలో రెండు విధాలుగా నిర్ణయించారు. అందులో రోడ్ల వెడల్పు 80 అడుగులలోపు ఉంటే ఆ ప్రాంతానికి రిజిస్ట్రేషన్‌ విలువలో 30 శాతం, 80 అడుగుల కంటే ఎక్కువ ఉంటే 50శాతం చెల్లించి ‘ఫ్రీ హోల్డ్‌’గా మార్చుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఒక ప్లాట్‌కు ఒకటి కంటే ఎక్కువ రోడ్లు ఉంటే అత్యంత వెడల్పైన రోడ్డు ప్రాతిపదికన డీఐఎఫ్‌ లెక్కించనున్నారు. మొత్తం 21 ఇండస్ట్రియల్‌ పార్కులు, స్టాండ్‌ అలోన్‌ భూములు కలుపుకుంటే 9,292 ఎకరాలు ఉండగా రోడ్ల విస్తీర్ణం పోను 4,740 ఎకరాలను ప్లాటెడ్‌ భూములుగా ప్రభుత్వం గుర్తించింది. దరఖాస్తు సమయంలో డీఐఎ్‌ఫలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. భూమి విస్తీర్ణాన్ని బట్టి ప్రాసెసింగ్‌, పబ్లికేషన్‌ చార్జీలు కూడా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.


భూమి విస్తీర్ణాన్ని బట్టి ప్రాసెసింగ్‌ ఫీజు

1 ఎకరం వరకు రూ.20,000

1 నుంచి 5 ఎకరాలు రూ.50,000

5 నుంచి 10 ఎకరాలు రూ.1 లక్ష

10 నుంచి 25 ఎకరాలు రూ.2 లక్షలు

25 నుంచి 50 ఎకరాలు రూ.5 లక్షలు

50 ఎకరాలపైగా రూ.10 లక్షలు.

బకాయిలు క్లియర్‌ చేయాలి

ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇప్పటికే ఏర్పాటై, పనిచేస్తున్న సొంత భూములు కలిగిన పరిశ్రమలు మాత్రమే హిల్ట్‌ పాలసీ కింద దరఖాస్తు చేసుకునే అర్హత పొందుతాయి. సేల్‌ డీడ్‌ పూర్తయి ఉండాలి. సదరు పరిశ్రమలు ఈవోటీ, మ్యూటేషన్‌, ఆస్తి పన్ను, సబ్‌ డివిజన్‌ చార్జీలు, డిలే కండోనేషన్‌ ఫీజులు సహా అన్ని బకాయిలు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది.


దరఖాస్తుల పరిశీలనకు గడువు

దరఖాస్తుల పరిశీలనకు కూడా గడువు ఖరారు చేశారు. జోనల్‌ మేనేజర్‌, ఐలా (ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ) కమిషనర్‌ కలిసి నాలుగు రోజుల్లో పరిశీలన పూర్తి చేసి స్ర్కూటినీ కమిటీ పంపించాలి. ఆ కమిటీ కూడా పరిశీలించి మూడు రోజుల్లో అప్రూవల్‌ కమిటీకి నివేదిక సమర్పించాలి. ఆ తర్వాత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్న అప్రూవల్‌ కమిటీ ఏడు రోజుల్లో అనుమతి, తిరస్కరణ లేదా వాయిదాపై నిర్ణయం తీసుకుంటుంది. లోపాలు ఉంటే వెంటనే ఆన్‌లైన్‌లో నోటీసులు జారీ చేస్తారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరిస్తే 3 రోజుల్లోపు సదరు పరిశ్రమ చెల్లించిన రుసుము రిఫండ్‌ అవుతుంది.

పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ వెలుపలికి తరలిస్తే ప్రత్యేక రాయితీలు

ఓఆర్‌ఆర్‌ వెలుపలకు పరిశ్రమలను తరలించే యూనిట్లకు కూడా ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. పాత సబ్సిడీలను కొనసాగించడంతో పాటు విద్యుత్‌, నీటి కనెక్షన్‌ ఫీజులను సర్దుబాటు చేస్తారు. ఓఆర్‌ఆర్‌ బయట ఇండస్ట్రియల్‌ పార్కుల్లో ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తారు. మల్టీ యూజ్‌ అనుమతి వచ్చిన తర్వాత కూడా గరిష్ఠంగా ఏడాది పాటు ప్రస్తుత ప్రాంతంలో పరిశ్రమ కొనసాగించుకునే వెసులుబాటు కల్పించారు. దరఖాస్తుల ద్వారా వచ్చే మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయనున్నారు. మొత్తం డీఐఎఫ్‌ వచ్చిన తర్వాత ప్రాసెసింగ్‌ ఫీజు, భవిష్యత్‌ మౌలిక వసతుల అభివృద్ధి కోసం టీజీఐఐసీకి 25 శాతం వాటా మినహాయించి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం, హెచ్‌ఎండీఏకు బదిలీ చేస్తారు.

గడువులోగా ఫీజు చెల్లించకపోతే..

అనుమతి వచ్చిన తర్వాత మిగిలిన 90 శాతం డీఐఎఫ్ను రెండు విడతల్లో చెల్లించాలి. మొదటి 45 శాతం డిమాండ్‌ నోటీసు వచ్చిన 45 రోజుల్లో, రెండో 45 శాతం మరో 45 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. 45 రోజుల గడువు దాటితే నెలకు ఒక శాతం పెనాల్టీ విధిస్తారు. రెండు విడతలకు అదనంగా ఒక్కో నెల చొప్పున గ్రేస్‌ పీరియడ్‌ ఇస్తారు. అయినా చెల్లింపులు జరగకపోతే అప్పటివరకు కట్టిన మొత్తం తిరిగిరాదు. దరఖాస్తుదారులను ప్రోత్సహించేందుకు రిజిస్ట్రేషన్‌ విలువ పెరిగినా ఈ ఏడాది జూన్‌ 30 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రస్తుత సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు (ఎస్‌ఆర్‌ఓ) రేట్లనే కొనసాగించనున్నారు.

Updated Date - May 24 , 2026 | 04:26 AM