Share News

ఉన్నత విద్యలో సంస్కరణలు భేష్‌.. భేష్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:01 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో నెలకొన్న సవాళ్లు, ఇతర అంశాలపై చర్చించడానికి ఆయా వర్సిటీల వైస్‌ చాన్స్‌లర్‌లతో సమావేశం ఏర్పాటు...

ఉన్నత విద్యలో సంస్కరణలు భేష్‌.. భేష్‌

  • వర్సిటీల వీసీల సమావేశం ఏర్పాటు చేయండి

  • ఉన్నత విద్యా మండలి చైర్మన్‌తో గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో నెలకొన్న సవాళ్లు, ఇతర అంశాలపై చర్చించడానికి ఆయా వర్సిటీల వైస్‌ చాన్స్‌లర్‌లతో సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య బాలకిస్టారెడ్డిని గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా కోరారు. ఉన్నత విద్యా రంగం అభివృద్ధిపై తగిన సూచనలు చేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల కులపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సోమవారం ఆయన లోక్‌ భవన్‌లో తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిస్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌లతో సమావేశమయ్యారు. ఉన్నత విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు బాగున్నాయని గవర్నర్‌ శివ్‌ప్రతాప్‌ శుక్లా ప్రశంసించారు. ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకొచ్చినందుకు బాలకిస్టారెడ్డిని అభినందించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యలో అమలు చేయనున్న సిలబస్‌, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పన లక్ష్యంగా వివిధ పరిశ్రమలతో విశ్వవిద్యాలయాల ఒప్పందాలు, చివరి సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌, ఇతర సంస్కరణలను గవర్నర్‌కు బాలకిస్టారెడ్డి వివరించారు. జాతీయ విద్యావిధానంలోని కొన్ని ఉత్తమ విధానాలను తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు. న్యాయ విద్యపై బాలకిస్టారెడ్డి రాసిన ‘ఫౌండేషన్స్‌ అండ్‌ ఫ్రాంటియర్స్‌’ పుస్తకాన్ని గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా ఆవిష్కరించారు.

Updated Date - Apr 07 , 2026 | 05:01 AM