సైన్యాన్ని దించండి
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:18 AM
శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ భూముల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న వైఖరి పట్ల గురువారం హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పిటిషనర్ భూమికి రక్షణ కల్పించండి
హైడ్రా కమిషనరొస్తే బ్యారెక్‌లో పడేయండి
ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కోల్పోయాం
పదే పదే కోర్టు ధిక్కరణ అలవాటైపోయింది
రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు ఆగ్రహం
ఏజీ విజ్ఞప్తితో అమలు ఒకరోజు వాయిదా
హైదరాబాద్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ భూముల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న వైఖరి పట్ల గురువారం హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ కంపెనీకి చెందిన మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1, 2లలో ఉన్న 40 ఎకరాల ప్రైవేటు పట్టా భూమిలోకి వెళ్లరాదన్న ఉత్తర్వులను మరోసారి ఉల్లంఘించడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఈ భూమిలోకి వెళ్లరాదన్న హైకోర్టు ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించడంతో ఏకంగా మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ఆదేశం మేరకు ఈ నెల 20న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా హైకోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. రంగనాథ్ హాజరైన తర్వాత కూడా తమ భూముల్లోకి హైడ్రా అధికారులు ప్రవేశించారని, ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుందని, అప్పటిదాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హెచ్చరించారని పేర్కొంటూ పిటిషనర్ కంపెనీ గురువారం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ పిటిషన్లకు అదనంగా మరో అప్లికేషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘ఆ భూముల్లోకి ప్రవేశించబోమని స్వయంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కోర్టుకు అండర్‌టేకింగ్ ఇచ్చారు. అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చిన తర్వాత కూడా హైడ్రా దుస్సాహసానికి పాల్పడుతూ మళ్లీ ఆ భూమిలోకి ప్రవేశించడం అక్రమం. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు. ఏజీ ఇచ్చిన హామీ సైతం ఉల్లంఘించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలపై మేం విశ్వాసం కోల్పోయాం.
మా ఆదేశాలను అమలు చేయించడానికి ఆర్మీని రంగంలోకి దించక తప్పదు. పిటిషనర్ స్థలంలోకి ప్రవేశిస్తే హైడ్రా అధికారులను వాహనాలతో సహా అదుపులోకి తీసుకోండి. అక్కడికి వస్తే హైడ్రా చీఫ్ రంగనాథ్‌ను సైతం అదుపులోకి తీసుకొని ఆర్మీ బ్యారెక్‌లో పడేయండి. ఇలాంటి వ్యవహారాల్లో ఆర్మీని మోహరించడం సమంజసం కాదని మాకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలపై మేం విశ్వాసం కోల్పోయాం. ఇక తప్పని పరిస్థితి ఏర్పడింది. సచివాలయంలో కూర్చున్న వారికి కూడా ఏం జరుగుతుందో తెలియాలి. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను హైకోర్టు రిజిస్ర్టార్ జనరల్ ఆర్మీ అధికారులకు తెలియజేయాలి. బైసన్ డివిజన్‌లోని సీనియర్ బ్రిగేడియర్, మరో పది మంది ఆర్మీ ఫోర్స్‌ను పిటిషనర్ భూమి వద్ద మోహరించాలి. అక్కడికి వచ్చే హైడ్రా అధికారులను ఎత్తేసి ఆర్మీ బ్యారెక్‌లో పడేయండి. వాహనాలను సీజ్ చేయండి’’ అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉదయం ఆదేశాలు జారీ చేయగా మధ్యాహ్నం తర్వాత అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి స్వయంగా జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం ఎదుట హాజరై ఈ విషయాన్ని ప్రస్తావించారు. పిటిషనర్ ఆరోపణలు సమంజసం కాదని, వివరణ ఇవ్వడానికి ఒక్క రోజు సమయం ఇవ్వాలని కోరారు. ఏజీ విజ్ఞప్తితో విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన ధర్మాసనం.. ఆర్మీ మోహరింపు ఉత్తర్వులను ఒక్క రోజు పాటు నిలిపేసింది.