క్షణికావేశంలో భర్తను పొడిచిన భార్యకు జైలు శిక్ష నుంచి విముక్తి
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:44 AM
క్షణికావేశం తప్ప హత్య చేయాలనే తప్పుడు ఉద్దేశం లేని ఓ భార్య మానసిక స్థితిని గుర్తించిన హైకోర్టు ఆమెకు జైలుశిక్ష నుంచి విముక్తి కల్పించింది.
హత్య చేయాలన్న దురుద్దేశం లేకపోవడమే కారణం
కింది కోర్టు తీర్పును కొట్టివేసిన హైకోర్టు
రూ.500 జరిమానా మాత్రం ఖరారు
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): క్షణికావేశం తప్ప హత్య చేయాలనే తప్పుడు ఉద్దేశం లేని ఓ భార్య మానసిక స్థితిని గుర్తించిన హైకోర్టు ఆమెకు జైలుశిక్ష నుంచి విముక్తి కల్పించింది. కేవలం జరిమానాను విధించింది. మంచిర్యాలలోని ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన రేష్మకు, ఆమె భర్తకు పడకపోవడంతో వేర్వేరుగా నివసించడం ప్రారంభించారు. కొద్దిరోజుల తర్వాత ఒక్కసారిగా ఆమెను చూసిన భర్త ఆవేశంతో తిట్టడం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. అది తీవ్రం కావడంతో ఆవేశం పట్టలేక రేష్మ తన భర్తను కత్తితో పొడిచింది. ఆ గాయం తీవ్రమైనది కావడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆమె కత్తితో పొడిచిన గాయం కారణంగానే భర్త ప్రాణాలు కోల్పోయాడని పోస్ట్‌మార్టంలో తేలింది. పోలీసులు ఆమెపై ఐపీసీ 304 పార్ట్-2 (హత్య కానప్పటికీ, శిక్షార్హమైన ప్రాణ నష్టం) కింద కేసు నమోదు చేశారు. నేరం నిరూపితం కావడంతో ఆసిఫాబాద్ సెషన్స్ కోర్టు ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధించింది. దీనిపై ఆమె హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. కత్తితో పొడవడం వెనుక హత్య చేయాలనే ఉద్దేశం లేదని, క్షణికావేశంలో జరిగిన ఘటన అని పేర్కొంది. అనుకోకుండా జరిగిన చర్య కాబట్టి కింది కోర్టు విధించిన జైలుశిక్షను రద్దు చేసింది. రూ.500 జరిమానాను ఖరారు చేస్తూ దానిని మాత్రం చెల్లించాలని ఇటీవల ఆదేశించింది.