Share News

నిర్మాత బండ్ల గణేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:15 AM

సినీనిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బండ్ల గణేశ్‌కు అనుకూలంగా ఉన్న డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్టీ) తీర్పును కొట్టేసిన హైకోర్టు..

నిర్మాత బండ్ల గణేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

  • సర్ఫేసి యాక్ట్‌ కింద ఆయన ఆస్తుల వేలం సబబేనని తీర్పు

సినీనిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బండ్ల గణేశ్‌కు అనుకూలంగా ఉన్న డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ (డీఆర్టీ) తీర్పును కొట్టేసిన హైకోర్టు.. గణేశ్‌, ఆయన తండ్రికి చెందిన ఆస్తులను సర్ఫేసి యాక్ట్‌ కింద వేలం వేయడం సబబేనని తీర్పు ఇచ్చింది. కార్పొరేట్‌ రుణగ్రహీతైన శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫాం ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రమోటర్లుగా ఉన్న బండ్ల గణేశ్‌, ఆయన తండ్రి, సోదరుడు ఆ కంపెనీకి గ్యారెంటీర్లుగా ఉన్నారు. ఆ కంపెనీ అప్పులు చెల్లించకపోవడంతో బండ్ల గణేశ్‌, ఇతర కుటుంబ సభ్యులకు జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆస్తిని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.8.50 కోట్లకు వేలంలో విక్రయించింది. అయితే, సదరు వేలం చెల్లదంటూ బండ్ల గణేశ్‌ డీఆర్టీని ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో డీఆర్టీ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ యూనియన్‌ బ్యాంకు, కొనుగోలుదారులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై జస్టిస్‌ మౌషమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. యూనియన్‌ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ.. బండ్ల గణేశ్‌కు అనుకూలంగా ఉన్న డీఆర్టీ తీర్పును కొట్టేసింది.

Updated Date - Jul 04 , 2026 | 06:16 AM