Share News

ఫీజు రీయింబర్స్‌ చేయరు.. వసూలు వద్దంటారు!

ABN , Publish Date - May 01 , 2026 | 05:11 AM

విద్యార్థుల ఖాతాల్లో రీయింబర్స్‌మెంట్‌ మొత్తం జమ చేసిన తర్వాతే వారి నుంచి ఫీజులు వసూలు చేయాలని, అడ్మిషన్ల సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి తీసుకురావద్దంటూ ప్రైవేటు కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం వెలువరించిన ...

ఫీజు రీయింబర్స్‌ చేయరు.. వసూలు వద్దంటారు!

  • ప్రభుత్వ జీవోపై హైకోర్టు అసంతృప్తి

  • గతంలో న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడి

  • కోర్టు ధిక్కరణ కిందకొస్తుందని హెచ్చరిక.. ప్రైవేటు కాలేజీల పిటిషన్లపై విచారణ

  • జీవోపై తాత్కాలిక స్టే.. తదుపరి విచారణ 4కు వాయిదా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఖాతాల్లో రీయింబర్స్‌మెంట్‌ మొత్తం జమ చేసిన తర్వాతే వారి నుంచి ఫీజులు వసూలు చేయాలని, అడ్మిషన్ల సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి తీసుకురావద్దంటూ ప్రైవేటు కాలేజీలకు సంబంధించి ప్రభుత్వం వెలువరించిన జీవోను హైకోర్టు తప్పుబట్టింది. ఈ అంశంపై తాము ఏప్రిల్‌ 2వ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు ఈ జీవో విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ పలు ప్రైవేటు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి గురువారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు అవినాశ్‌ దేశాయ్‌, ఎల్‌. రవిచందర్‌ వాదనలు వినిపించారు. ఫీజు వసూలుకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు ఏప్రిల్‌ 2న ఇచ్చిన ఆదేశాల మీద కౌంటర్లు దాఖలు చేయకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు గడువు గురించి చెప్పకుండా ప్రభుత్వం బుధవారం జీవో 7 జారీ చేసిందన్నారు. దీంట్లోని 12వ నిబంధన ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వం ఆయా విద్యార్థుల ఖాతాలకు బదిలీ చేస్తుందని, ఆ తర్వాత టీఏఎ్‌సఆర్‌సీ నిర్ణయించిన మొత్తం ప్రకారం విద్యార్థులు కాలేజీకి ఫీజు చెల్లిస్తారని తెలిపారు. ఈ నిబంధన వల్ల ఫీజులను వసూలు చేసుకునే అవకాశం కాలేజీలకు లేకుండా పోయిందని, ఈ నిబంధనను నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎస్‌. రాహుల్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు గడువు, కాలేజీలకు టోకెన్ల జారీ తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయడానికి సోమవారం వరకు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోలోని నిబంధన.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందన్నారు. దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందన్నారు. సదరు నిబంధనను మే 4వ తేదీ వరకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేశారు.

Updated Date - May 01 , 2026 | 05:11 AM