ఉచితాల కోసం అప్పుల కొండ!
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:57 AM
రాష్ట్రంలో అమలవుతున్న భారీ సంక్షేమ పథకాల కోసం తీసుకున్న అప్పు ఎంత? పేరుకుపోయిన బకాయిల భారం ఎంత? అనే వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని..
సంక్షేమ పథకాలు, ఉచితాల కోసం తీసుకున్న అప్పు ఎంత?
ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అఫిడవిట్ ఇవ్వాలి: హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అమలవుతున్న భారీ సంక్షేమ పథకాల కోసం తీసుకున్న అప్పు ఎంత? పేరుకుపోయిన బకాయిల భారం ఎంత? అనే వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. సంక్షేమ పథకాలకు అవసరమయ్యే నిధుల కోసం అప్పులు చేయటం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం-2005 ప్రకారం చెల్లదని పేర్కొంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టులో విచారణ గురువారం కొనసాగింది. ఎలాంటి చట్టం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (జీవో) ద్వారా పన్ను చెల్లింపుదారుల డబ్బును కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఖర్చు చేయడం చెల్లదని పేర్కొంటూ న్యాయవాది విజయ్‌గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సదరు పథకాలపై హైకోర్టు స్టే విధించటంతో, స్టే ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ కొనసాగించింది. ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేశారు. దీంట్లో తప్పులు ఉండటం, ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారి రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను తప్పుగా రాయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల గురించి దీంట్లో ఎలాంటి వివరాలు లేవని తెలిపింది. రాష్ట్రంలో అమలవుతున్న భారీ సంక్షేమ పథకాల కోసం ఎన్ని రుణాలు తీసుకున్నారు? పోగుపడ్డ మొత్తం బకాయిలు ఎంత? అనే వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అప్పులు చేసి సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం-2005 ప్రకారం చెల్లదని పేర్కొంది. ఈ పథకాలు 2014 నుంచీ అమలవుతున్నాయని.. వాటిని తప్పుపట్టాల్సి వస్తే.. 2014 నుంచి తప్పుపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాజకీయ చర్చలు, వ్యక్తులు, పార్టీలతో సంబంధం లేదని.. ఎవరు అధికారంలో ఉన్నా తాము చట్టబద్ధతను మాత్రమే పరిశీలిస్తామని పేర్కొంది. ప్రభుత్వ చర్యల వల్ల ఏ ఒక్క వ్యక్తి ఇబ్బంది పడ్డా కోర్టుకు రావచ్చని.. విచారణ చేపట్టడానికి ఆ ఒక్క కారణం చాలని ధర్మాసనం తెలిపింది.
ఆ ప్రచారంలో వాస్తవం లేదు
ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ వాదిస్తూ.. ఉచిత పథకాల అమలు కోసం, భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వటం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. భూనిర్వాసితుల పరిహారానికి సంబంధించి హైకోర్టులో 19 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని, వాటిల్లో కొంతమందికి ఇప్పటికే టోకెన్లు జారీ చేశామని తెలిపారు. మిగతా వారికి కూడా వివిధ దశల్లో నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. గురువారం లిస్టయిన భూ నిర్వాసితుల కోర్టు ధిక్కరణ కేసులు 19 అని, మొత్తంగా చూస్తే చాలా ఉన్నాయన్నారు. వీరందరికీ ఇవ్వాల్సిన పరిహారం ఎంత? అన్న వివరాలను తెలియజేయాలని ఏఏజీని ఆదేశించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై విధించిన స్టేను తొలగించాలని ఏఏజీ పలుమార్లు అభ్యర్థించినప్పటికీ.. ధర్మాసనం అంగీకరించలేదు.
రాజకీయ వ్యాఖ్యలపై తీవ్ర వాగ్వాదం
పిటిషనర్ విజయ్ గోపాల్ వాదిస్తూ.. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు ప్రభుత్వానికి ఎంతోకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారని, చట్టబద్ధంగా నిధులు ఇవ్వాల్సిన చోట ప్రభుత్వం మంజూరు చేయటం లేదన్నారు. రూ.5 కోట్ల బిల్లులు విడుదల కాకపోవడంతో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారని, ఆయనకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నివాళులు కూడా అర్పించారని.. అయినా సరే బిల్లు విడుదల కాలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఉద్యోగుల విజ్ఞప్తులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం పిటిషనర్ కోర్టును వాడుకుంటున్నారని, ఈ అనుచిత వైఖరిని కోర్టు అనుమతించవద్దన్నారు. మరోవైపు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఉచిత పథకాలు కావని, వాటిని అమలు చేయాలని, తమ వాదన కూడా వినాలని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. అందరి వాదనలు వింటామని పేర్కొన్న ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.