టెక్నికల్, ప్రొఫెషనల్ పోస్టుల్లో స్థానికతకు ఏడో తరగతి ప్రామాణికం కాదు
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:04 AM
టెక్నికల్, ప్రొఫెషనల్ డిగ్రీలు అర్హతగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల స్థానికతను నిర్ణయించడానికి ‘ఏడో తరగతి వరకూ ఎక్కడ చదివారు...
ఆ నిబంధన ప్రతి పోస్టుకూ బెంచ్ మార్కు కాదు
దానిని అన్నింటికీ అప్లై చేయలేం..
అర్హత కోర్సు ఎక్కడ చదివారో అక్కడే స్థానికులు
రాష్ట్రపతి ఉత్తర్వుల్ని టీఎస్‌పీఎస్సీ సంకుచితంగా అర్థం చేసుకుని సందర్భరహితంగా అమలు చేస్తోంది
స్థానికత ఏడో తరగతితోనే నిర్ధారణ అయితే అది అన్యాయమైన ఫలితాలకు దారి తీస్తుంది: హైకోర్టు
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): టెక్నికల్, ప్రొఫెషనల్ డిగ్రీలు అర్హతగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల స్థానికతను నిర్ణయించడానికి ‘ఏడో తరగతి వరకూ ఎక్కడ చదివారు?’ అనే అంశం ప్రామాణికం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సదరు పోస్టుకు అర్హతగా నిర్ణయించిన కోర్సు ఎక్కడ చదివారో మాత్రమే చూడాలని.. సంబంధిత అర్హత కోర్సు తెలంగాణలో చదివి ఉంటే వారిని స్థానికులుగా గుర్తించాలని తేల్చిచెప్పింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంటకు చెందిన పల్లా నిషాంత్.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుకు దరఖాస్తు చేయగా అతడు ఏడో తరగతి వరకూ నాలుగేళ్లపాటు తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో చదివాడని.. ఈ మేరకు అతడికి స్థానికత లేదని టీఎ్‌సపీఎస్సీ తిరస్కరించింది. దీనిపై అతడు కోర్టును ఆశ్రయించగా.. సింగిల్ జడ్జి పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుపై టీఎ్‌సపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు దాఖలు చేసింది. దానిపై జస్టిస్ శ్యాంకోషీ, జస్టిస్ నర్సింగ్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం.. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 (జీవో నంబర్ 124)లోని 7వ పేరాను క్షుణ్నంగా విశ్లేషించింది. ఈ కేసుకు సంబంధించిన పోస్టులకు.. ఆ పేరాలోని రెండు షరతుల్లో (‘ఏడో తరగతి వరకు ఎక్కడ చదివారు’/ ‘సంబంధిత అర్హత పరీక్ష ఎక్కడ ఉత్తీర్ణులయ్యారు?’) దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అనేది చూడాలని పేర్కొంది. ‘ఏడో తరగతి వరకూ ఎక్కడ చదివారు’ అనే నిబంధనను యాంత్రికంగా అమలు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఇక్కడ టీఎ్‌సపీఎస్సీ రాష్ట్రపతి ఉత్తర్వులను సంకుచిత దృష్టితో అర్థంచేసుకుంటోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మొత్తం ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కేవలం ‘ఏడో తరగతి వరకు ఎక్కడ చదివారు’ అనే షరతును సందర్భరహితంగా టీఎ్‌సపీఎస్సీ అమలు చేస్తోందని ఆక్షేపించింది. దీన్ని టెక్నికల్, ప్రొఫెషనల్ పోస్టులకు అలాగే అప్లై చేస్తే సదరు పేరా 7 (1)(ఏ) అర్థం లేకుండా మారిపోతుందని తెలిపింది.
‘ఏడో తరగతి వరకూ ఎక్కడ చదివారు’ అనే నిబంధన ప్రతి పోస్టుకూ బెంచ్ మార్క్ కాదని.. సదరు పోస్టుకు ఉన్న కనీస అర్హత ఏంటో తెలుసుకోకుండా అన్నింటికీ అప్లై చేయలేమని తెలిపింది. పేరా 7 (1)(ఏ) లో పేర్కొన్న రిలవెంట్ క్వాలిఫైంగ్ ఎగ్జామినేషన్ (సంబంధిత అర్హత పరీక్ష) అనేది చాలా ముఖ్యమైనదని.. ఒక అభ్యర్థి సంబంధిత అర్హత పరీక్షకు సంబంధించిన కోర్సును వరుసగా నాలుగేళ్లు స్థానికంగా చదివాడా? లేదా? అనేది చూడాలని పేర్కొంది. ‘స్థానికత అనేది ఏడో తరగతిలోనే నిర్ధారణ అయితే పెద్ద పెద్ద అర్హతలు కలిగిన ప్రొఫెషనల్ పోస్టుల్లో ‘సంబంధిత అర్హత పరీక్ష’ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. స్థానికత ఏడో తరగతిలోనే నిర్ధారణ అయితే అది అన్యాయమైన ఫలితాలకు దారితీస్తుంది. ఉన్నత విద్య మొత్తం తెలంగాణలోనే చదివినప్పటికీ ప్రాథమిక దశలో పాఠశాల విద్య ఇక్కడ చదవలేదనే కారణంతో నాన్ లోకల్ అంటే ఎలా? కాబట్టి.. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 7 (1)(ఏ) లో పేర్కొన్న సంబంధిత అర్హత పరీక్ష అనే నిబంధనను పోస్టులవారీగా సహేతుక పద్ధతిలో అమలు చేయాలి’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ.. టీఎ్‌సపీఎస్సీ అప్పీల్‌నుకొట్టేసింది.