విటులందరూ నేరస్థులు కాదు
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:40 AM
సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లే వినియోగదారులందరూ నేరస్థులు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ వృత్తిని చేపట్టిన మహిళల వద్దకు వెళ్లే కస్టమర్లపై కేసు ఉండదని కీలక తీర్పు ఇచ్చింది.
ఇష్టపూర్వకంగా వృత్తి చేపట్టిన సెక్స్‌వర్కర్ వద్దకు వెళ్తే కేసు లేదు
బలవంతమైతే కేసు తప్పదు.. హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లే వినియోగదారులందరూ నేరస్థులు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ వృత్తిని చేపట్టిన మహిళల వద్దకు వెళ్లే కస్టమర్లపై కేసు ఉండదని కీలక తీర్పు ఇచ్చింది. అయితే బాధిత సెక్స్ వర్కర్ మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్) బాధితురాలు అయి ఉండి.. ఆమెను బలవంతంగా సెక్స్ వర్కర్‌గా మార్చారని తెలిసినప్పటికీ కస్టమర్ వెళ్తే కేసు పెట్టవచ్చని తెలిపింది. అలాంటివారిపై మాత్రం ఐపీసీ సెక్షన్ 370 ఏ(2) (ప్రస్తుత బీఎన్‌ఎ్‌సలో 143, 144 సెక్షన్లు) వర్తిస్తాయని పేర్కొంది. ఒక వ్యక్తి వ్యభిచార గృహం లేదా వ్యభిచార వ్యాపార కేంద్రం వద్ద దొరికినప్పుడు ఐపీసీ సెక్షన్ 370ఏ(2) కింద కేసు పెట్టాలా? లేదా? అనేది ప్రతి సంఘటనకు సంబంధించిన వాస్తవాలు, అక్కడి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. సెక్స్ వర్కర్ వద్దకు వెళ్లారని చెప్పి పోలీసులు తమపై మానవ అక్రమ రవాణా నిరోధక చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ 370ఏ (2) పెట్టారని పేర్కొంటూ హైకోర్టులో దాదాపు 137 పిటిషన్లు దాఖలయ్యాయి. కేవలం డబ్బులు చెల్లించి లైంగిక సేవలు వినియోగించుకున్నందుకు ట్రాఫికింగ్ కేసులు పెట్టడం చెల్లదని, వాటిని కొట్టేయాలని నిందితులు కోరారు. తొలుత విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం.. సాధారణ సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లిన కస్టమర్లకు మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం వర్తించదని పేర్కొంది. అయితే ఐపీసీ సెక్షన్ 370ఏ (2) వర్తిస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ కేసును డివిజన్ బెంచ్‌కు రిఫర్ చేసింది. దానిపై జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. సెక్స్ వర్కర్ వద్దకు వెళ్లే కస్టమర్‌కు ట్రాఫికింగ్ కేసు వర్తించదని పేర్కొంది. ట్రాఫికింగ్ ద్వారా బలవంతంగా సెక్స్ వర్కర్‌గా మారిన బాధితురాలిని లైంగికంగా దోపిడీ చేస్తున్నట్లు పరిస్థితుల ద్వారా అనిపిస్తే, ఆ కస్టమర్‌కు ఆమె ట్రాఫికింగ్ బాధితురాలు అని ముందుగా తెలిసి ఉంటే ఐపీసీ సెక్షన్ 370ఏ(2) కింద కేసు పెట్టవచ్చని తెలిపింది.