Share News

టెండర్లపై సర్కారుదే తుది నిర్ణయం: హైకోర్టు

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:21 AM

టెండర్ల నోటిఫికేషన్‌ జారీపై తుది అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. దురుద్దేశం, విధానపరమైన అక్రమాలు జరిగితే తప్ప వాటిలో....

టెండర్లపై సర్కారుదే తుది నిర్ణయం: హైకోర్టు

  • 8రోడ్డు టెండర్లపై కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ అప్పీల్‌ కొట్టివేత

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): టెండర్ల నోటిఫికేషన్‌ జారీపై తుది అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. దురుద్దేశం, విధానపరమైన అక్రమాలు జరిగితే తప్ప వాటిలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని అర్నకొండ నుంచి మల్యాల ఎక్స్‌రోడ్‌ వరకు 35 కిలోమీటర్ల డబుల్‌ రోడ్‌, అలాగే వేములవాడ నుంచి సిరికొండ రహదారి వెడల్పు కోసం ఇచ్చిన టెండర్లను సవాల్‌ చేస్తూ శ్రీశ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థిస్తూ.. అందులో జోక్యం అవసరం లేదని అభిప్రాయపడింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రెండు రోడ్ల టెండర్ల నోటిఫికేషన్‌ మార్చి మరో నోటిఫికేషన్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో శ్రీశ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. టెండర్లు మార్చి నోటిఫికేషన్‌ ఇవ్వడంలో అక్రమాలను నిరూపించడంలో పిటిషనర్‌ విఫలమయ్యారని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేశారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సంస్థ అప్పీల్‌ దాఖలు చేసింది. అప్పీల్‌పై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్‌ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదంటూ అప్పీల్‌ను కొట్టివేసింది.

Updated Date - Mar 10 , 2026 | 03:21 AM