పవన్ ఖేడా ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణార్హతపై తీర్పు రిజర్వు
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:00 AM
అసోంలోని గువాహటి పోలీసులు దాఖలు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కాంగ్రెస్ నేత పవన్ ఖేడా దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత ఉందా ..
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): అసోంలోని గువాహటి పోలీసులు దాఖలు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కాంగ్రెస్ నేత పవన్ ఖేడా దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత ఉందా ? లేదా ? అనే అంశంపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రిణికి శర్మకు మూడు పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని పవన్ ఖేడా ఢిల్లీలో ఆరోపణలు చేశారు. దీనిపై గువాహటి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వవన్ ఖేడా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే సుజన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. రాజకీయ దురుద్దేశంతోనే అసోం పోలీసులు పవన్ ఖేడాపై సంబంధం లేని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఖేడా తరఫున న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఖేడా పట్ల అసోం ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలిపారు. మరోపక్క, అసోం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ) దేవజిత్ సైకియా వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ ఖేడా ఢిల్లీలో శాశ్వత నివాసి. ఆయనపై కేసు నమోదైంది అసోంలో. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారు. ఈ పిటిషన్‌ను విచారించే భౌగోళిక అధికారిక పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదు. ిఖేడా హైదరాబాద్ నివాసి కాకపోయినా .. తాను తెలంగాణకు చెందిన వ్యక్తినంటూ హైకోర్టును మోసం చేయాలని చూస్తున్నారు.’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.