Share News

బండి సాయి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:07 AM

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

బండి సాయి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట
baghirath

  • పోక్సో కేసు వివరాలు ప్రసారం చేయొద్దని

  • సోషల్‌ మీడియా, టీవీ ఛానెళ్లకు ఆదేశాలు

హైదరాబాద్‌, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అతని కేసు వివరాలు, కంటెంట్‌ ప్రసారం చేయరాదంటూ వివిధ టీవీ చానళ్లు, సోషల్‌ మీడియా వేదికలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనకు సాధారణ బెయిల్‌ లభించినప్పటికీ తన, తన కుటుంబ సభ్యుల ప్రతిష్ఠ దెబ్బతినేలా సోషల్‌ మీడియాలో, కొన్ని టీవీ చానళ్లలో కంటెంట్‌ ప్రసారం చేస్తూనే ఉన్నారని, దీన్ని అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సాయి భగీరథ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. సాయి భగీరథ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదిస్తూ అతను ప్రైవేటు ఫంక్షన్లకు హాజరైన ఫొటోలు, వీడియోలు తీసి పోక్సో కేసుకు అంటగడుతూ వ్యక్తిత్వ హననం చేసేలా కంటెంట్‌ రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టులో విచారణలో ఉన్న అంశంపై వ్యాఖ్యానాలు చేయరాదనే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, మీడియా ట్రయల్‌తో పాటు పిటిషనర్‌పై ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారని తెలిపారు. పిటిషనర్‌ కేసుకు సంబంధించి ఎలాంటి ప్రసారాలు, కంటెంట్‌ అప్‌లోడ్‌ చేయకుండా ఆయా మీడియా సంస్థలు, టీవీ చానెళ్లు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌, ప్రైవేటు వ్యక్తులను అడ్డుకోవడంతోపాటు సదరు కంటెంట్‌ను తొలగించేలా గూగుల్‌, మెటా, ఎక్స్‌ తదితర సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.


ఆయా ఖాతాల సమాచారం, డిజిటల్‌ ఆధారాలు, కంటెంట్‌ అప్‌లోడింగ్‌ డేటా, హిస్టరీ, ఎలక్ట్రానిక్స్ రికార్డులు భద్రపర్చేలా గూగుల్‌, మెటా, ఎక్స్‌ సామాజిక వేదికలను ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి కంటెంట్‌ ప్రసారం చేయరాదని టీవీ చానళ్లు, ప్రైవేటు వ్యక్తులు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ను ఆదేశించింది. ఆ కంటెంట్‌ను తొలగించడంతో పాటు ఆధారాలు భద్రపర్చాలని గూగుల్‌, మెటా, ఎక్స్‌ వేదికలకు ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ, కేంద్ర ఎలక్ర్టానిక్స్ ఐటీ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, గూగుల్‌, మెటా, ఎక్స్‌ వేదికలు, ప్రైవేటు టీవీ చానళ్లు, కొందరు ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Oct 09 , 2026 | 06:07 AM