‘సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లర్ల అక్రమాలపై దర్యాప్తు జరగాల్సిందే‘
ABN , Publish Date - May 09 , 2026 | 06:46 AM
రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇవ్వని రైస్ మిల్లర్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
సొంత అవసరాలకు ధాన్యాన్ని మళ్లించారు
వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయలేం: హైకోర్టు
రైస్ మిల్లర్లు దాఖలు చేసిన 58 పిటిషన్ల కొట్టివేత
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇవ్వని రైస్ మిల్లర్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాల కార్పొరేషన్ తమపై పెట్టిన పోలీసు కేసులను కొట్టేయాలంటూ మిల్లర్లు దాఖలు చేసిన 58 పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్లు సొంత అవసరాలకు వినియోగించుకోవడంతోపాటు అక్రమంగా లబ్ధి పొందారనే ఆరోపణలు కేసు నమోదు చేయదగిన నేరాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు పూర్తికాకుండానే ఆ ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయడం కుదరదని పేర్కొంది. ‘కస్టం మిల్లింగ్ రైస్‌కు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఒప్పందం ప్రకారం బియ్యం అందజేసినా మాపై అక్రమంగా కేసులు పెట్టారు. వాటిని కొట్టేయాలి’ అని చాముండేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ కాసం సాత్విక్ సహా 58 మంది మిల్లర్లు హైకోర్టులో వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. వాటిపై జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ఫిర్యాదు చేయడానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్లు తగిన కాంపిటెంట్ అథారిటీలు కాదని, వారి ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడం చెల్లదని కోర్టుకు తెలిపారు. తమపై పెట్టిన సెక్షన్లకు కావాల్సిన ముడిసరుకు జరిగిన ఘటనల్లో లేదని.. చిన్న చిన్న విషయాలకు పెద్ద సెక్షన్లు నమోదు చేశారని ఆరోపించారు.
తనిఖీలు జరిగిన తేదీకి.. ఫిర్యాదు ఇచ్చిన తేదీలకి మధ్యలో నెలల తరబడి వ్యత్యాసం ఉందని.. చాలా ఆలస్యంగా చేసిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించడం చెల్లదని పేర్కొన్నారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. పిటిషనర్లు పౌరసరఫరాల కార్పొరేషన్‌తో సీఎంఆర్ ఒప్పందం చేసుకున్నారని, అందులోని షరతులు ఇరుపక్షాలకు వర్తిస్తాయని తెలిపారు. ఒప్పందం ప్రకారం బియ్యం అందజేయని మిల్లర్లపై ఫిర్యాదులు చేయాలని జిల్లా మేనేజర్లకు కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. పోలీసుల తరఫున స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు వాదిస్తూ.. కేసుల దర్యాప్తు మధ్యలో ఉండగా మిల్లర్లపై నమోదైన క్రిమినల్ కేసులు కొట్టేస్తే ప్రజాధనానికి నష్టం వాటిల్లుతుందని.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కస్టం మిల్లింగ్ రైస్ ఇవ్వకుండా కొంతమంది మిల్లర్లు తప్పించుకుంటున్నారని కోర్టుకు వివరించారు.