Share News

రంగనాథ్‌ను తప్పించండి!

ABN , Publish Date - Jul 28 , 2026 | 06:10 AM

ప్రభుత్వ ఆస్తులు, జలవనరుల రక్షణ, విపత్తు నిర్వహణ చర్యలు వంటి ప్రజోపయోగ పనుల కోసం ఏర్పాటైన హైడ్రాకు సరైన వ్యక్తిని కమిషనర్‌గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)కి హైకోర్టు సోమవారం విజ్ఞప్తి చేసింది.

రంగనాథ్‌ను  తప్పించండి!

  • ఆ 63 కేసులు వేసింది భూకబ్జాదారులే చట్టపరంగా ఎదుర్కొంటా: రంగనాథ్‌

  • హైడ్రాకు సరైన కమిషనర్‌ను నియమించండి

  • తెలంగాణ సీఎస్‌కు సిఫారసు చేసిన హైకోర్టు

  • ఉన్నతాధికారిగా పదే పదే కోర్టు ధిక్కరణలు

  • ఏడాదిన్నరలో రంగనాథ్‌పై 63 ధిక్కార కేసులు

  • కొనసాగిస్తే చట్టబద్ధమైన పాలనకు ప్రమాదం

  • ప్రభుత్వానికి సూచించిన జస్టిస్‌ అనిల్‌ కుమార్‌

  • అఫిడవిట్‌తో హైకోర్టుకు రంగనాథ్‌ క్షమాపణలు

  • వాటిని తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం

  • న్యాయ సలహా తర్వాతే అప్పీలుకు.. సర్కార్‌ నిర్ణయం

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్తులు, జలవనరుల రక్షణ, విపత్తు నిర్వహణ చర్యలు వంటి ప్రజోపయోగ పనుల కోసం ఏర్పాటైన హైడ్రాకు సరైన వ్యక్తిని కమిషనర్‌గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి హైకోర్టు సోమవారం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి వీలైనంత వేగంగా తొలగించాలని కోరింది. మల్కాజిగిరి మండలం లోతుకుంట సర్వే నంబర్‌ 1, 2లలో శాంతాశ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి సంబంధించిన 40 ఎకరాల ప్రైవేటు పట్టా భూమిలోకి వెళ్లరాదన్న ఉత్తర్వులను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఉల్లంఘించడంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. గత విచారణల సందర్భంగా హైడ్రా కమిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. సైన్యాన్ని సైతం మోహరిస్తామని హెచ్చరించింది. సోమవారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ జూకంటి అనిల్‌ కుమార్‌ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రంగనాథ్‌ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. అయితే, హైకోర్టుకు లిఖితపూర్వక క్షమాపణలు తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని, సదరు భూమిలోకి హైడ్రా ప్రవేశించలేదని తెలిపారు. ఈ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కోర్టుఽ ధిక్కరణపై రంగనాథ్‌ క్షమాపణలు తెలియజేశారని.. ఈ నేపథ్యంలో కేసులు ముగించాలని కోరారు.


కేసులను ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని, వివరణ పూర్వక తీర్పు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. రంగనాథ్‌ క్షమాపణలను తిరస్కరించింది. వీలైనంత వేగంగా ఆయనను హైడ్రా కమిషనర్‌గా తొలగించాలని సీఎ్‌సకు విజ్ఞప్తి చేసింది. ‘‘రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ ర్యాంకు కలిగిన సీనియర్‌ ఐపీఎస్‌ రంగనాథ్‌ పదే పదే కోర్టు ఉల్లంఘనకు పాల్పడ్డారు. పదే పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ న్యాయవ్యవస్థ గౌరవ మర్యాదలను అపఖ్యాతి పాలు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆయనను అలాగే కొనసాగిస్తే రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనకు ప్రమాదం ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆస్తులు, నాలాలు, జల వనరులను రక్షించే మంచి ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటైంది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ ఏడాదిన్న పదవీకాలంలో ఆయనపై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదయ్యాయి. ఇలాంటి అధికారిని అలాగే పదవిలో కొనసాగిస్తే న్యాయ వ్యవస్థ గౌరవ మర్యాదలకు, చట్టబద్ధమైన పాలననకు ప్రమాదం. అనేకసార్లు ఆయనకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో మరో ప్రత్యామ్నాయం లేక ఆయనను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫార్సు చేస్తున్నాం. మొదటిసారి కోర్టు ధిక్కరణ తప్పులను క్షమించవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొంది. ప్రస్తుత కేసులో ఏకంగా మూడుసార్లు కోర్టు తీర్పులను ఉల్లంఘించారు. ఇది ఆయన అహంకారపూరిత స్వభావాన్ని తెలియజేస్తోంది. గ్రీకు పురాణాల్లో సర్ప రూప జల రాక్షసి(లెర్నియన్‌ హైడ్రా) ఉంటుంది. దానిని నియంత్రించడం దాదాపు సాధ్యం కాదు. ప్రస్తుత హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కూడా అలాగే తయారయ్యారు. పిటిషనర్‌ భూమిలోకి ప్రవేశించబోమని అడ్వకేట్‌ జనరల్‌ స్వయంగా ఇచ్చిన అండర్‌ టేకింగ్‌ను కూడా ఆయన పాటించలేదు. అధికారాన్ని ఏకపక్షంగా ప్రయోగిస్తే ప్రమాదకరంగా మారుతుంది. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఈ కోర్టు రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి రిలీవ్‌ చేయాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేస్తోంది. ఆయన ఇలాగే కొనసాగితే చట్టబద్ధమైన పాలనకు ప్రమాదం. హైడ్రాకు సరైన కమిషనర్‌ను నియమించాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి ర్యాంకు కలిగిన ఆఫీసర్‌ పదేపదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్న నేపథ్యంలోనే చాలా అప్రమత్తంగా ఉంటూ మేం ఆయనను తొలగించాలన్న వ్యాఖ్య చేస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది.


న్యాయ సలహా తర్వాతే అప్పీలుకు

హై కోర్టు తీర్పుపై ప్రభుత్వం న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించింది. తీర్పు ప్రతి బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది. దీనిపై అప్పీలుకు వెళ్లాలా? అన్న దానిపై న్యాయసలహా తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సోమవారం కోర్టు తీర్పు విషయం వచ్చింది. హైడ్రాను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించింది. ప్రభుత్వ భూముల పరిరక్షణలో, చెరువుల పునరుద్ధరణలో, పార్కులు, ఆటస్థలాలను కబ్జాల నుంచి కాపాడటంలో హైడ్రా కీలక పాత్ర పోషించిందని ప్రభుత్వం భావిస్తోంది. హైకోరు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ తుది నిర్ణయం ఏమై ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది.

Updated Date - Jul 28 , 2026 | 06:12 AM