Share News

పరిశ్రమలకు తీసుకున్న భూమి తాకట్టు పెట్టి పారిపోతున్నారు

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:00 AM

వితరణలో బ్యాంకు అధికారులు శిబిచక్రవర్తిని మించి పోయారని రాష్ట్ర హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని నోటీసు ఇచ్చిన ...

పరిశ్రమలకు తీసుకున్న భూమి తాకట్టు పెట్టి పారిపోతున్నారు

  • 200కోట్ల ప్రాజెక్టుకు 500కోట్ల రుణం మంజూరు చేస్తారా?

  • రుణం మంజూరు చేసిన బ్యాంకు అధికారిపై కేసు పెట్టారా?

  • సదరు అధికారిపై సీబీఐకి ఫిర్యాదు చేశారా?

  • సెమ్‌ ఇండియా ఫ్యాబ్‌ కేసులో ఎస్‌బీఐని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): వితరణలో బ్యాంకు అధికారులు శిబిచక్రవర్తిని మించి పోయారని రాష్ట్ర హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని నోటీసు ఇచ్చిన భూమిపై హైకోర్టు స్టే ఇస్తే, అలాంటి భూమిని తాకట్టు పెట్టుకుని రుణం ఎలా మంజూరు చేస్తారని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ)ను ప్రశ్నించింది. రూ.200 కోట్ల ప్రాజెక్టుకు రూ.500 కోట్లు రుణం మంజూరు చేసిన ఆ బ్యాంకు అధికారి మహానుభావుడని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై ఇంకా సీబీఐకి ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని ఫ్యాబ్‌ సిటీ పరిధిలో సెమ్‌ ఇండియా ఫ్యాబ్‌ పైవ్రేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి కేటాయించిన 100 ఎకరాల స్వాధీనానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బెంగళూరు ఎస్బీఐ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్బీఐ తరఫు న్యాయవాది వాదిస్తూ.. తాము రికవరీ ప్రక్రియ చేపట్టిన తర్వాత సదరు కంపెనీకి కేటాయించిన భూమి స్వాధీనానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చెల్లదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు స్టే ఉన్న భూమికి రుణం ఇచ్చిన బ్యాంకు అధికారిపై సీబీఐకి ఫిర్యాదు చేశారా, కేసు నమోదైందా అని ఎస్బీఐని ప్రశ్నించింది. ఒకవేళ ఫిర్యాదు చేయకపోతే సుమోటోగా కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుందని పేర్కొంది. ‘ప్రజలు నమ్మకంతో బ్యాంకుల్లో పెట్టిన సొమ్మును అడ్డగోలుగా రుణాలు మంజూరు చేస్తున్నారు. పరిశ్రమలు పెడతామంటూ ప్రభుత్వం నుంచి భూమిని తీసుకోవడం, దాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుని పారిపోవడం, బ్యాంకులు దివాలా తీయడం జరుగుతోంది. ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూమిని కేటాయిస్తోంది. ఆ లక్ష్యాన్ని కంపెనీలు నీరుగారుస్తున్నాయి. వాటికి బ్యాంకులు సహకరిస్తున్నాయి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించిన ధర్మాసనం.. వివరణ ఇవ్వాలని పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, టీజీఐఐసీ, సెమ్‌ ఇండియా ఫ్యాబ్‌ పైవ్రేట్‌ లిమిటెడ్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ ఈనెల 25కు వాయిదా పడింది.

Updated Date - Jun 19 , 2026 | 03:00 AM