Share News

విద్యార్థుల ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారు?

ABN , Publish Date - May 05 , 2026 | 03:58 AM

రాష్ట్రంలో విద్యార్థుల నుంచి కాలేజీలు నేరుగా ఫీజులు వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది.

విద్యార్థుల ఖాతాల్లో  ఎప్పుడు జమ చేస్తారు?

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పూర్తి వివరాలు తెలపండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  • డీబీటీకి మారినా పాత బకాయిల నుంచి తప్పించుకోలేరు

  • జీవో 7లోని నిబంధనపై సస్పెన్షన్‌ కొనసాగుతుంది

  • విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోబోమని వెల్లడి

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యార్థుల నుంచి కాలేజీలు నేరుగా ఫీజులు వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. కొత్త విద్యాసంవత్సరం నుంచి రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఫీజులను నేరుగా విద్యార్థుల ఖాతాలోనే జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు జమ చేస్తారన్న అంశంపై స్పష్టమైన నిర్ణయంతో రావాలని సర్కారుకు హైకోర్టు సూచించింది. ఈ అంశాన్ని వివరిస్తున్న జీవో 7 పేరా 5లోని 12వ నిబంధనపై స్పష్టత ఇవ్వకపోతే కొత్త విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల సమయంలోనే కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునే అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేసింది. నేరుగా లబ్ధిదారులకే బదిలీ (డీబీటీ) విధానంలోకి మారినప్పటికీ కాలేజీలకు చెల్లించాల్సిన పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని హైకోర్టు పేర్కొంది. ఏప్రిల్‌ 29న జారీ చేసిన జీవో 7 పేరా 5లోని 12వ నిబంధనపై ఇప్పటికే విధించిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థుల ఖాతాలో నేరుగా ఫీజులు జమ చేసే వరకు వారి నుంచి ఫీజులు వసూలు చేయరాదని జీవో 7లోని 12వ నిబంధన పేర్కొంటోంది. విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు ఏప్రిల్‌ 2న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా జీవో 7లోని 12వ నిబంధన ఉన్నందున న్యాయస్థానం దాన్ని సస్పెండ్‌ చేసింది. ఆ సస్పెన్షన్‌ ఉత్తర్వులు తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ అమల్లో ఉంటాయని తెలిపింది. అలాగే పాత బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనే అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని పలు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి ఽధర్మాసనం ఎదుట మరోసారి విచారణకు వచ్చాయి. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదిస్తూ.. నేరుగా విద్యార్థుల ఖాతాలో ఫీజులు జమ చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అలాగే 2025-26 వరకు ఉన్న పాత బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తోందని.. ఈ మేరకు టోకెన్లు సైతం జారీచేసిందని చెప్పారు. కాలేజీల తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయి వాదిస్తూ.. కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేస్తే తప్ప ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. క్రమం తప్పకుండా బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వానికి గడువు నిర్దేశించాలని కోరారు. మరోవైపు ఫీజుల కోసం కాలేజీలు వేధిస్తున్నాయంటూ పలువురు విద్యార్థులు ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యపై ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నామని, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 24కు వాయిదా వేసింది.

Updated Date - May 05 , 2026 | 03:58 AM