Share News

ఎన్నికల హామీలు ఎలా నమ్ముతారు?

ABN , Publish Date - Feb 10 , 2026 | 05:03 AM

ఎన్నికల హామీలను ఎలా నమ్ముతారు, వాటిని ఇంకా విశ్వసిస్తున్నారా? అని తెలంగాణ ఉద్యమకారులను సోమవారం హైకోర్టు ప్రశ్నించింది.

ఎన్నికల హామీలు ఎలా నమ్ముతారు?

  • ఇంటి స్థలం, పింఛను ఇవ్వడానికి మీరేమైనా స్వాతంత్య్ర సమరయోధులా?

  • ప్రభుత్వం ఎంతమందికని ఇవ్వగలుగుతుంది?

  • తెలంగాణ ఉద్యమకారులకు హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీలను ఎలా నమ్ముతారు, వాటిని ఇంకా విశ్వసిస్తున్నారా? అని తెలంగాణ ఉద్యమకారులను సోమవారం హైకోర్టు ప్రశ్నించింది. ఇంటి స్థలం, పింఛను ఇవ్వడానికి మీరేమైనా స్వాతంత్య్ర సమరయోధులా? అని అడిగింది. అయినా ఎంతమందికని ప్రభుత్వం వీటిని ఇవ్వగలుగుతుందని ప్రశ్నించింది. ఈ అంశంపై వైఖరి తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్థలం, పింఛను ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ దానిని ఇంతవరకు అమలు చేయలేదని పేర్కొంటూ గొల్లపల్లి నాగరాజు, కే యాదగిరి మరికొంతమంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది కరుణాకర్‌రెడ్డి వాదిస్తూ.. ఉద్యమకారులు కొందరు పోలీసు కేసులు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఇంకొందరు ఉద్యోగాలకు అర్హత కోల్పోయి నిరుద్యోగులుగా మారారని తెలిపారు. స్పందించిన ధర్మాసనం ఎన్నికల హామీలను విశ్వసించి వాటిని అమలు చేయాలని ఎలా కోరుతారని అడిగింది. ఉద్యమకారులకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా విధానం రూపొందించిందా? జీవోలు జారీచేసిందా? అని ప్రశ్నించింది. మీకు అనుకూలంగా ఏదైనా ఆదేశం ఇస్తే అది తేనె తుట్టెను కదిపినట్లే అవుతుందని పేర్కొంది. ‘మీరేమైనా స్వాతంత్య్ర సమరయోధులా? నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడారా? ఎందుకు ఇవ్వాలి?’ అని అడిగింది. న్యాయవాది సమాధానం ఇస్తూ ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది ఉద్యమకారులకు ప్రయోజనాలు కల్పిస్తూ జీవోలు ఇచ్చిందని, కానీ వాటిని రహస్యంగా ఉంచిందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం... వైఖరి తెలియజేయాలని పేర్కొంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

Updated Date - Feb 10 , 2026 | 05:03 AM