Share News

వారసత్వ కట్టడాల పరిరక్షణకు కమిటీ వేశారా?

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:41 AM

రాష్ట్రంలో వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ(హెచ్‌సీసీ)ని ఏర్పాటు చేశారా? ఏర్పాటు చేస్తే అది పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తోందా?

వారసత్వ కట్టడాల పరిరక్షణకు కమిటీ వేశారా?

  • మెట్రో నిర్మాణ పనులకు ఆ కమిటీ అనుమతి ఉందా?

  • వివరాలు సమర్పించండి: హైకోర్టు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ(హెచ్‌సీసీ)ని ఏర్పాటు చేశారా? ఏర్పాటు చేస్తే అది పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తోందా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు చేపడుతున్న పనులకు ఈ కమిటీ అనుమతి పొందారా? అని ప్రశ్నించింది. ఈ మేరకు పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌ మెట్రోరైల్‌ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వారసత్వ కట్టడాల చట్టం ప్రకారం అనుమతులు పొందకుండా మెట్రో పనులు చేపడుతున్నారని పేర్కొంటూ ‘యాక్ట్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌’ అధ్యక్షుడు మొహమ్మద్‌ రహీమ్‌ఖాన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా బుధవారం చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ రూట్‌లో ‘మెట్రో అలైన్‌మెంట్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌’ ఇవ్వాలన్న గత ఆదేశాల మేరకు మెట్రోరైల్‌ సంస్థ న్యాయమూర్తులకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చింది. తెలంగాణ వారసత్వ కట్టడాల చట్టం-2017లో ఉన్న ఏ వారసత్వ కట్టడం కూడా మెట్రో నిర్మాణంతో ప్రభావితం కావడం లేదని ప్రభుత్వం, మెట్రో తరఫున హాజరైన ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. మరోవైపు పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. మెట్రో పనులకు హెరిటేజ్‌ కన్జర్వేషన్‌ కమిటీ అనుమతి లేదని తెలిపారు. తదుపరి విచారణ మార్చి 3కు వాయిదా పడింది.

Updated Date - Feb 05 , 2026 | 04:41 AM