ఫీజులు వసూలు చేసుకోవచ్చు!
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:32 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా నేరుగా విద్యార్థుల నుంచి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు పునరుద్ఘాటించింది.
ప్రైవేటు కాలేజీలకు హైకోర్టు ఆదేశాలు
ప్రభుత్వం ఇచ్చిన తాజా జీవో 9పై స్టే
గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను బైపాస్ చేసేలా జీవో తీసుకురావడం ఏంటని ప్రశ్న
హైకోర్టు అధికారాల్ని కించపరిచేలా జీవో తెచ్చారన్న పిటిషన్‌దారులు
నగదు బదిలీ మార్గదర్శకాల కోసమే జీవో.. ప్రభుత్వం వాదన
స్టే విధించవద్దని.. కేంద్రం నిధులు ఆగిపోతాయని విజ్ఞప్తి
అంగీకరించని ధర్మాసనం
పలు క్లాజులపై స్టే
తదుపరి విచారణ 30కి వాయిదా
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా నేరుగా విద్యార్థుల నుంచి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు పునరుద్ఘాటించింది. విద్యార్థుల ఖాతాలో ఫీజు రీయింబర్స్ జమ చేసే వరకు ప్రైవేటు కాలేజీలు ఫీజులను వసూలు చేయరాదని పేర్కొంటున్న జీవో 7పై స్టే విధించిన తర్వాత.. మళ్లీ అదే తరహా నిబంధనలతో ప్రభుత్వం జీవో 9 విడుదల చేయడం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది తమ ఉత్తర్వులను బైపాస్ చేసేలా (దాటవేసేలా) ఉందని తెలిపింది. ఈ మేరకు జీవో 9లోని 5(2)(ఈ), 10(2), 10(4), 12(1)(ఏ) క్లాజులపై స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. జీవో 9పై స్టే విధించాలని ఇంజినీరింగ్ తదితర ప్రైవేటు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ల మీద గురువారం జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ కొనసాగించారు. పిటిషనర్ల తరుఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వులతో సంబంధం లేకుండా నేరుగా ప్రైవేటు కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసిన తర్వాత.. వాటిని బైపాస్ చేసే విధంగా ప్రభుత్వం మళ్లీ కొత్త జీవో తీసుకురావడం అక్రమమని పేర్కొన్నారు. ఇది హైకోర్టు అధికారాన్ని కించపర్చడమేనని, నేరుగా చేయలేని పనిని చాటుగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పాత నిబంధనలనే మార్గదర్శకాల రూపంలో మళ్లీ జారీ చేయడం న్యాయసమీక్షకు నిలువదని తెలిపారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు గత ఉత్తర్వులను జీవో 9 తక్కువ చేయడం లేదని.. విద్యార్థులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ఎలా అమలు చేయాలో వివరిస్తూ ఇచ్చిన మార్గదర్శకాలు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ కేసులో అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తారని.. మంగళవారం వరకు గడువు ఇవ్వాలని కోరారు. జీవో 9పై స్టే విధిస్తే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. నగదు బదిలీ పథకంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉందని.. స్టే ఇస్తే కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఖాతాలో నేరుగా జమ చేసే నిధులు ఆగిపోతాయని తెలిపారు. పిటిషన్‌లో ఇంప్లీడ్ అయిన పలువురు విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. అటు ప్రభుత్వం ఇటు ప్రైవేటు కాలేజీల మధ్య నలిగి పోతున్నామని, ఫీజు కట్టాలని కాలేజీలు వేధిస్తున్నాయని పేర్కొన్నారు. ఫీజు కట్టాలని ముందే తెలిస్తే అడ్మిషన్లు తీసుకోకుండా ఉండేవాళ్లమన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. జీవో 9లోని పలు క్లాజులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.