బిడ్డను కనలేని లోపం ఉంటే.. సరోగసీని ఎంచుకోవచ్చు
ABN , Publish Date - Mar 08 , 2026 | 05:37 AM
సహజంగా తల్లి కాలేని అనారోగ్య సమస్యలతో బాధపడే మహిళలు సరోగసీ విధానాన్ని ఎంచుకోవటంలో తప్పు లేదని హైకోర్టు తెలిపింది.
అర్హత సర్టిఫికెట్ నిరాకరించటం.. సంతానాన్ని పొందే హక్కును దూరం చేయటమే
పిటిషనర్‌కు సరోగసీ అర్హత సర్టిఫికెట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): సహజంగా తల్లి కాలేని అనారోగ్య సమస్యలతో బాధపడే మహిళలు సరోగసీ విధానాన్ని ఎంచుకోవటంలో తప్పు లేదని హైకోర్టు తెలిపింది. అరుదైన వైద్యపరమైన లోపంతో బాధపడుతున్న ఓ వైద్యురాలికి సరోగసీ రెగ్యులేషన్ చట్టం - 2021 కింద అర్హత సర్టిఫికేట్ జారీచేయాలని వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. కంప్లీట్ ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటివిటీ సిండ్రోమ్ (సీఏఐఎస్) అనే అత్యంత అరుదైన జన్యులోపంతో బాధపడుతున్న పిటిషనర్‌కు సర్టిఫికేట్ నిరాకరిస్తూ కాంపిటెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీచేయడం చెల్లదని స్పష్టంచే సింది. సరోగసీ రెగ్యులేషన్ చట్టం - 2021 ప్రకారం అర్హత సర్టిఫికేట్ ఇవ్వాలని నిజాంపేటకు చెందిన ఓ వైద్యురాలు వైద్యారోగ్య శాఖ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తనకు అరుదైన లోపం ఉన్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఇచ్చిన సైటోజెనెటిక్ రిపోర్ట్‌ను సైతం అందజేశారు. అయితే సరోగసీ విధానాన్ని ఎంచుకునే అర్హత పిటిషనర్‌కు లేదని కాంపిటెంట్ అథారిటీ ఆమె దరఖాస్తును తిరస్కరించింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఇలాంటి బాధిత మహిళల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతోనే కేంద్రం సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ - 2021ను ఆమోదించింది. సరోగసీ విధానాన్ని ఎంచుకోవడానికి ఆమెకు అర్హత లేదని చెప్పి సంతానాన్ని పొందే హక్కును దూరం చేయడం అంటే చట్టం మూల ఉద్దేశాన్ని దెబ్బతీయడమే’ అని పేర్కొంది. ధర్మశాస్త్రాలు నిర్దేశించిన వివాహ వ్యవస్థ ఉద్దేశం ఉత్తమమైన సంతానాన్ని పొందటమేనని వ్యాఖ్యానించింది.