హైకోర్టు దగ్గరి ఫుట్‌పాత్‌పైనా ఆక్రమణలు తొలగించలేదు
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:06 AM
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి విరుద్ధంగా టౌన్‌ప్లానింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిని వదిలిపెట్టొదన్న సుప్రీంకోర్టు తీర్పును...
హైదరాబాద్ అంతటా ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించాలి
నిబంధనలు ఉల్లంఘించే వారిని వదలొద్దు: హైకోర్టు
హైదరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి విరుద్ధంగా టౌన్‌ప్లానింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిని వదిలిపెట్టొదన్న సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు మరోసారి గుర్తుచేసింది. కనీసం హైకోర్టు దగ్గర ఉన్న ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను కూడా తొలగించకపోవడాన్ని తప్పుపట్టింది. వృద్ధులు, పాదచారులకు ఇబ్బంది లేకుండా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయాలని, ఉన్నవాటిపై ఆక్రమణలు తొలగించాలని కోరుతూ రిటైర్డ్ జర్నలిస్టు బీ సురేందర్, మరికొంతమంది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అక్రమణలపై పురపాలక శాఖ అధికారులను సాధారణ పౌరులు కూడా అప్రమత్తం చేసేలా టీజీ-బీపాస్ చట్టంలో నిబంధనలు ఉన్నాయని తెలిపింది. తాము ఆదేశాలు ఇచ్చిన తర్వాత కనీసం హైకోర్టు సమీపంలో అయినా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగించలేదని ఆక్షేపించింది. ‘టౌన్‌ప్లానింగ్ స్కీంను ఉల్లంఘించే వారు ఎలాంటి ఉపశమనానికి అర్హులు కారు. అక్రమ నిర్మాణాలను, అనుమతిలేని నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు హైకోర్టులు తమ అధికార పరిధిని వినియోగించరాదు’ అని సుప్రీంకోర్టు పలు కేసుల్లో ఇచ్చిన తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసే క్రమంలో ఎలా వ్యవహరించాలనే విషయాలను ‘బుల్డోజర్ కేసు’లో స్పష్టంగా పేర్కొందని, వాటిని కచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపుపై తీసుకున్న చర్యలు వివరించేందుకు మరో రెండువారాలు సమయం ఇస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు వద్ద నుంచి మొదలు పెట్టి హైదరాబాద్ అంతా ఆక్రమణలు తొలగించాలని స్పష్టం చేసింది.