Share News

‘బంక్‌ బెడ్స్‌’ వ్యవహారంపై విచారణ చేపట్టండి

ABN , Publish Date - May 09 , 2026 | 06:41 AM

రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలకు బంక్‌ బెడ్స్‌ సరఫరాలో అక్రమాల ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

‘బంక్‌ బెడ్స్‌’ వ్యవహారంపై విచారణ చేపట్టండి

  • కస్తూర్బా విద్యాలయాలకు ఆ బెడ్ల సరఫరాలో అక్రమాల ఆరోపణలను తేల్చండి

  • పాఠశాల విద్యాశాఖకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలకు బంక్‌ బెడ్స్‌ సరఫరాలో అక్రమాల ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తిచేసి చర్యలు చేపట్టేవరకు బంక్‌ బెడ్స్‌ సరఫరా టెండర్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 252 కస్తూర్బా విద్యాలయాల్లో బాలికల కోసం పరుపు, దిండుతో కూడిన 45,360 బంక్‌ బెడ్స్‌ (ఎక్కువ మంది విద్యార్థులకు సరిపడేలా ఒకదానిపైన ఒకటి బెడ్స్‌ ఉండేవి) సరఫరా చేయడానికి గతేడాది ఏప్రిల్‌ 26న సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ టెండర్లు పిలిచారు. ట్రుఫా ఎంటర్‌ప్రైజెస్‌, మఫత్‌లాల్‌ ఇండస్ట్రీస్‌, మెథోడెక్స్‌ సిస్టమ్స్‌ సంస్థలను ఎంపిక చేశారు. అయితే ఇప్పటికే గడువులోగా బంక్‌ బెడ్స్‌ సరఫరాలో విఫలమైన సంస్థలతో సప్లిమెంటరీ ఒప్పందం చేసుకుని, ధరను అడ్డగోలుగా పెంచి.. ప్రభుత్వ ఖజానాకు రూ.వంద కోట్ల నష్టం కలిగిస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే తరహా బంక్‌ బెడ్స్‌ను ఇతర ప్రభుత్వ శాఖలకు రూ.15,300 ధరతోనే సరఫరా చేయగా.. ఇక్కడ అక్రమంగా రూ.33,000కు ధర పెంచేశారని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. టెండర్‌ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం జరగలేదని పాఠశాల విద్యాశాఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్‌ పేర్కొన్న రూ.15,300 ధర 2021లో పరుపు, దిండు లేకుండా రవాణా, బిగింపు, ఐదేళ్ల వారంటీ చార్జీలు జోడించకుండా చేసిన సరఫరాకు సంబంధించినదని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌ ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు బిల్లుల చెల్లింపు సహా బంక్‌ బెడ్ల టెండర్‌ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

Updated Date - May 09 , 2026 | 06:43 AM