జూనియర్ లెక్చరర్ల ఇంక్రిమెంట్లపై 2 నెలల్లో నిర్ణయం తీసుకోండి
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:28 AM
జూనియర్ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించిన నేపథ్యంలో వారికి ప్రొబేషన్, వార్షిక ఇంక్రిమెంట్లు ఇచ్చే విషయమై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ..714 మందికి ఊరట
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): జూనియర్ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించిన నేపథ్యంలో వారికి ప్రొబేషన్, వార్షిక ఇంక్రిమెంట్లు ఇచ్చే విషయమై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 2023 మే 1న జారీచేసిన జీవో నెంబర్లు 19, 20, 21 ప్రకారం ప్రభుత్వం తమ సర్వీసును క్రమబద్ధీకరించిందని, కానీ ప్రొబేషన్, వార్షిక ఇంక్రిమెంట్ల చెల్లింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంటూ దాదాపు 714 మంది జూనియర్ లెక్చరర్లు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కే శరత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ఒక్కసారి సర్వీసు రెగ్యులరైజ్ అయిన తర్వాత వార్షిక ఇంక్రిమెంట్లు చెల్లించకుండా వాయిదా వేయడం, ప్రొబేషన్ ప్రకటించకపోవడం వల్ల అలవెన్సులు, సర్వీసు, సీనియార్టీ వంటి వాటిపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం... ఇప్పటికే మూడేళ్లు పూర్తయిందని, ఇంకెంత సమయం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. దీన్ని వేగంగా పూర్తిచేసి రెండునెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీచేస్తూ.. విచారణను ముగించింది.