Share News

TS High Court: నాలుగు వారాల్లో తెలంగాణ డీజీపీ ఎంపిక పూర్తి చెయ్యండి

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:03 AM

తెలంగాణ డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)ను హైకోర్టు ఆదేశించింది.

TS High Court: నాలుగు వారాల్లో తెలంగాణ డీజీపీ ఎంపిక పూర్తి చెయ్యండి

  • ప్రభుత్వం ఇప్పటికే పంపిన జాబితా ఆధారంగానే అర్హుల సిఫారసు

  • యూపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు

  • డీజీపీ శివధర్‌రెడ్డి నియామక జీవో కొట్టివేతకు నిరాకరణ

హైదరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ డీజీపీ నియామక ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)ను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆలస్యం చేసిందనే విషయాన్ని పక్కన పెటి, ప్రభుత్వం ఇప్పటికే పంపిన అధికారుల జాబితా నుంచి అర్హులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. ప్రకాశ్‌ సింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో డీజీపీల నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అమలు చేయాలని పేర్కొంది. అలాగే, ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి నియామక జీవోపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన మధ్యంతర దరఖాస్తును కొట్టేసింది. డీజీపీ శివధర్‌ రెడ్డి నియామకం చెల్లదని, తాత్కాలిక పద్ధతిలో ఆయన్ను డీజీపీగా నియమించడం అక్రమమని పేర్కొంటూ టీ ధన్‌గోపాలరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది. పిటిషనర్‌ వ్యక్తిగత హోదాలో వాదనలు వినిపిస్తూ.. శివధర్‌రెడ్డి నియామకం తాత్కాలిక పద్ధతిలో జరిగినందున దానిపై స్టే ఇవ్వాలని తాను దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్‌ను పెండింగ్‌లో ఉంచాలని కోరారు. అందుకు నిరాకరించిన ధర్మాసనం.. సదరు అప్లికేషన్‌ను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రొసీజర్‌కు సంబంధించిన వివాదం అయినందున సుదీర్ఘంగా వినాల్సి ఉంటుందని.. ఈ దశలో ప్రస్తుత డీజీపీ నియామకమాన్ని కొట్టేయలేమని పేర్కొంది. అలాగే, సీనియర్‌ ఐపీఎ్‌సల జాబితాను ఇప్పటికే యూపీఎస్సీకి పంపామని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి చెబుతున్న నేపథ్యంలో.. తీవ్ర ఆలస్యం అనే విషయాన్ని పక్కనపెట్టాలని యూపీఎస్సీకి హైకోర్టు సూచించింది. తాజాగా ఎంపిక ప్రక్రియ చేపట్టి.. 4వారాల్లో అర్హులను సిఫారసు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.


యూపీఎస్సీ జాబితాలో ఉండేదెవరు ?

డీజీపీ ఎంపిక ప్రక్రియను 4 వారాల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. యూపీఎస్సీ తుది జాబితాలో ఉండే అధికారులు ఎవరు ? అనే అంశం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. డీజీపీ నియామకానికి సంబంధించి 2025 డిసెంబరు 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అర్హులైన ఐదుగురు ఐపీఎస్‌ అధికారుల పేర్లతో జాబితాను కేంద్రానికి పంపారు. ఆ జాబితాలో 1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌, 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, శివధర్‌ రెడ్డి, సౌమ్యామిశ్రా, షికా గోయల్‌ ఉన్నారు. జాబితా రావడం ఆలస్యమైందని, సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవాలంటూ యూపీఎస్సీ 2026 జనవరి 1న ఆ జాబితాను వెనక్కు పంపింది. ఈ విషయాలన్ని పరిశీలించిన హైకోర్టు.. డిసెంబరు 31న ప్రభుత్వం పంపిన జాబితా నుంచే అర్హులను ఎంపిక చేయాలని యూపీఎస్సీని ఆదేశించింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. రాష్ట్రం పంపిన జాబితాలోని ఐదుగురు అధికారుల్లో నుంచి ముగ్గురిని ఎంపిక చేసి యూపీఎస్సీ రాష్ట్రానికి సిఫారుసు చేయాలి. అనంతరం ఆ ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎంపిక చేస్తుంది. రాష్ట్రం పంపిన జాబితాలో ఉన్న సీవీ ఆనంద్‌ పదవీ కాలం 2028 వరకు ఉండగా, ఇంటెలిజెన్స్‌బ్యూరో స్పెషల్‌ డైరక్టర్‌గా కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే పదవీ కాలం 2029వరకు ఉంది. అలాగే శివధర్‌ రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ఉంది. పోటీలో ఉన్న సౌమ్యమిశ్రా 2027, షికాగోయల్‌కు 2029 వరకు పదవీ కాలం ఉంది. దీంతో ఐదుగురిలో ఆ ముగ్గురెవరు అనే విషయం చర్చనీయాంశమైంది.

Updated Date - Jan 10 , 2026 | 05:03 AM