ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను అరెస్ట్ చెయ్యండి
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:05 AM
ఓ కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
శుక్రవారం ఆయన్ను కోర్టులో హాజరుపర్చండి
కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : ఓ కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్ట్ చేసి శుక్రవారం తమ ఎదుట ప్రవేశపెట్టాలని జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నిధులకు సంబంధించిన కేసులో తమ ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు సందీప్ కుమార్ సుల్తానియాకు వ్యతిరేకంగా ఇటీవల బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ కుమార్ సుల్తానియా ఎక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేసి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తమ ఎదుట ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. ఒకవేళ తాను స్వయంగా కోర్టుకు హాజరవుతానని హామీ ఇస్తూ కోర్టు ధిక్కరణదారు రూ.5 వేల విలువకు వ్యక్తిగత బాండ్ ఇస్తే అతడిని బెయిల్‌పై విడుదల చేయాలని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సదరు కోర్టుధిక్కరణదారు ప్రతి వాయుదాకు హాజరుకావాల్సిందే అని ధర్మాసనం స్పష్టం చేసింది.