భూనిర్వాసితులకు పరిహారమివ్వకుండా..ఉచితాలా?
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:40 AM
‘‘దేశ ప్రగతి, నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ఉచితపథకాలకు డబ్బులు ఇస్తున్నారు. అసలు ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏమిటి?
పరిహారం, ఉపాధి, ఉద్యోగాలు ఇస్తే కల్యాణలక్ష్మి ఎందుకు?
పన్నుచెల్లింపుదారుల డబ్బును ఉచితాలకు ఎందుకు ఇస్తారు?: హైకోర్టు
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అమలుపై స్టే ఎత్తివేతకు నిరాకరణ.. నేడూ విచారణ
సోషల్‌మీడియాలో ‘తెలుగు స్ర్కైబ్’ అసత్య ప్రచారం: పిటిషనర్ విజయ్‌గోపాల్
ఆ కంటెంట్ తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశ ప్రగతి, నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ఉచితపథకాలకు డబ్బులు ఇస్తున్నారు. అసలు ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏమిటి? చట్టబద్ధంగా హక్కుగా రావాల్సిన భూపరిహారం ఇవ్వకుండా నిధులన్నీ ఉచిత పథకాలకు ఇస్తే ఎలా? వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి ఇవ్వాల్సిన పరిహారానికి ప్రాధాన్యం ఇవ్వాలా? ఉచిత పథకాలకు డబ్బులు ఇవ్వాలా? అనే అంశాన్ని ప్రభుత్వం తేల్చుకోలేకపోతే ఎలా?’’ అని హైకోర్టు ప్రశ్నించింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై విధించిన స్టేను ఎత్తివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వెకేట్ స్టే పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భూములు కోల్పోయినవారికి చట్టబద్ధంగా రావాల్సిన పరిహారం ఇచ్చి.. ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కావాలని ఎవరూ ప్రభుత్వాన్ని అడగరు. ప్రభుత్వరంగ సంస్థలు సంపాదించే లాభాలతో ఉచిత పథకాలు అమలు చేయండి. లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎ్‌సఆర్) కింద వచ్చే నిధులతో అమలు చేయండి. అంతేగానీ ప్రజలు కట్టే ప్రత్యక్ష, పరోక్ష పన్నులను ఉచిత పథకాలకు మళ్లిస్తే జీతాలు, పింఛన్లు, చట్టబద్ధంగా ఇవ్వాల్సిన భూపరిహారం పరిస్థితి ఏంటి?’’ అని నిలదీసింది. భూసేకరణ చేసి తమకు పరిహారం ఇవ్వలేదంటూ దాఖలైన అనేక ధిక్కరణ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిపై అధికారులను పిలిపిస్తే వారు నిధులు లేవంటున్నారని గుర్తుచేసింది. దీంతో.. భూపరిహారానికి సంబంధించిన అన్ని వివరాలతో వస్తామని.. స్టే ఎత్తేసి తుది విచారణ చేపట్టాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ హైకోర్టును కోరారు. అయితే, తక్షణం స్టే ఎత్తేయడానికి నిరాకరించిన హైకోర్టు.. ఏఏజీ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ప్రభుత్వ విధాన నిర్ణయం..
ఈ పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్.. ‘‘కౌంటర్ దాఖలులో ఆలస్యం వల్ల హైకోర్టు ఈ పథకాలపై స్టే విధించింది. కానీ బటయ దీనిపై దుష్ప్రచారం జరుగుతోంది. ఈ పిటిషన్ స్వభావరీత్యా ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) కిందకు వస్తుంది. పిటిషనర్ సొంత హక్కులకు ఎలాంటి భంగం కలిగినా రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పిటిషనర్ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ (పిల్). పిల్‌ను విచారించే రోస్టర్ ఈ కోర్టుకు లేదు. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం. ఇది కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (జీవో) ద్వారా అమలు చేస్తున్న పథకం అని పిటిషనర్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. శాసనసభ స్వయంగా ఈ పథకాలకు నిధులు కేటాయిస్తూ బడ్జెట్‌ను ఆమోదించింది. ఇక్కడ శాసనసభకు శాసనాధికారం (లెజిస్లేటివ్ కాంపిటెన్స్) ఉందా? లేదా? అని మాత్రమే చూడాలి. బడ్జెట్‌ను ఆమోదించే, నిధులు కేటాయించే అధికారం శాసన సభకు ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా చట్టం లేకపోవడం అనే సమస్యే తలెత్తదు. ఒక్క తెలంగాణలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఆడపిల్లల చదువు, అభివృద్ధి, వివాహం కోసం అనేక పథకాలు అమలు అవుతున్నాయి.. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు స్వయంగా తన తీర్పులో పేర్లతో సహా ప్రస్తావించింది. రూ. 2 లక్షలలోపు కుటుంబ ఆదాయం కలిగిన కుటుంబాలలోని ఆడపిల్లల వివాహాలకు సాయం అందించే పథకాలు ఇవి. బడ్జెట్ ఉంది.. కేటాయింపులు జరిగాయి.. భూనిర్వాసితులకు ఇచ్చే పరిహారం.. సంక్షేమ పథకాలు వేర్వేరు అంశాలు.
ఈ రెండింటినీ ప్రభుత్వం తన ప్రాధాన్యతల ప్రకారం నిర్వహిస్తుంది. భూపరిహారానికి మొదటి ప్రాధాన్యం ఇస్తుంది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల నిధుల కేటాయింపు పద్దులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. ఈ పిటిషన్‌లో తుది విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెంటనే స్టే ఎత్తేసి.. తుది విచారణ ప్రారంభించాలి’’ అని కోర్టుకు తెలిపారు. ఆయన వాదనలు విన్న ధర్మాసనం.. ‘ కౌంటర్ వేయలేదనే కారణంతో స్టే ఇవ్వలేదు. ఈ పిటిషన్‌లో చర్చించాల్సిన అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. అర్థవంతంగానే స్టే ఇచ్చాం’ అని స్పష్టం చేసింది. కాగా.. ఈ పిటిషన్ వేసిన తర్వాత తనకు బెదిరింపులు వస్తున్నాయని పిటిషనర్ విజయ్‌గోపాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘నీ సొమ్ము ఏమైనా తింటున్నామా? నీకేంటి? అని అంటున్నారు. నాకు రక్షణ కల్పించాలి. అలాగే ‘తెలుగు స్ర్కైబ్’ అనే సోషల్ మీడియా న్యూస్ హ్యాండిల్ నాపై దుష్ప్రచారం చేస్తోంది. నా వెనుక సీఎం ఉండి నడిపిస్తున్నాడని.. ఈ పథకాలు అమలు కాకుండా సీఎం కుట్ర చేశారని వార్తలు పెట్టింది. ఈ సోషల్‌మీడియా హ్యాండిల్‌పై దాదాపు 73 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దాని నిర్వాహకులు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. ఈ పిటిషన్‌లో పోలీసు, రెవెన్యూ, సోషల్‌మీడియా సంస్థలను ప్రతివాదులుగా చేర్చాలి’ అని కోరారు. ఆయన విజ్ఞప్తి మేరకు.. ఈ కేసుకు సంబంధించి ‘తెలుగు స్ర్కైబ్’ పెట్టిన కంటెంట్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.