హైడ్రా.. సూపర్ కాప్ అనుకోవద్దు
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:15 AM
రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిన కేసులకు సంబంధించిన ప్రైవేటు భూముల్లో హైడ్రా జోక్యం చేసుకోవడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఓడిపోయిన కేసుల్లో వేలు పెట్టొద్దు.. హైకోర్టు వ్యాఖ్యలు
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిన కేసులకు సంబంధించిన ప్రైవేటు భూముల్లో హైడ్రా జోక్యం చేసుకోవడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా తనకు తాను ‘సూపర్ కాప్’గా ఫీలవుతున్నట్లు ఉందని ఆక్షేపించింది. ప్రభుత్వం ఓడిపోయిన కేసుల్లో తాను (హైడ్రా) ప్రతివాదిగా లేనందున ప్రైవేటు భూముల్లోకి వెళ్లే సాహసం చేయరాదని పేర్కొంది. హైడ్రా అధికారులు చట్టానికి, కోర్టు తీర్పులకు అతీతులు కారని స్పష్టం చేసింది. హైడ్రా పుట్టుకకు ఆధారమైన 2024అక్టోబరు 16 నాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ జీవో 191కు లోబడి ఉండాలని పేర్కొంది. మల్కాజ్‌గిరి మండలం లోతుకుంటలోని సర్వే నం.1, 2లో ఉన్న ఆస్తి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, శాంత శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు మధ్య వివాదంలో ప్రభుత్వం దాఖలు చేసిన సివిల్ సూట్, మొదటి అప్పీళ్లలో సర్కారు ఓడిపోయింది. అయినా ఆ భూమిలో ప్రభుత్వం హైడ్రా ద్వారా జోక్యం చేసుకుంటోందని.. ప్రైవేటు భూమిలో హైడ్రా ప్రవేశించిందని పేర్కొంటూకోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘హైడ్రా కార్యాలయాలు, ఆఫీసర్లు ప్రభుత్వంలో ఒక భాగం మాత్రమే. గత వివాదాల్లో హైడ్రా ప్రతివాదిగా లేదనే కారణంతో ప్రతి ప్రైవేటు భూమిలో తలదూర్చకూడదు. ప్రభుత్వ ఆసక్తులను అమలు చేస్తున్నామనే ఉత్సాహం హైడ్రా అధికారులకు ఉంటే ఉండొచ్చు.. అలాగని చెప్పి చట్టానికి అతీతంగా వ్యవహరిస్తామంటే కుదరదు. చట్టాన్ని అతిక్రమిస్తే.. కోర్టులు చూస్తూ ఊరుకుంటాయని అనుకోవద్దు’ అని పేర్కొంది. ‘హైడ్రా తొందరపాటుతో ప్రైవేటు భూమిలోకి ప్రవేశించి పొరపాటు చేసింది. పిటిషనర్ ఆస్తిలో జోక్యం చేసుకోబోమని ప్రస్తుతం హైడ్రా న్యాయవాది ఈ కోర్టుకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయాధికారి హామీ ఇచ్చారంటే దానికి అన్ని శాఖలు కట్టుబడి ఉండాల్సిందే. తాము ప్రత్యేక వర్గం అనే భావనలో హైడ్రా అఽధికారులు ఉన్నారని అనిపిస్తోంది. వారికి వారు ‘సూపర్ కాప్’ అనుకోవడం కుదరదు. చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది’అని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం ఇప్పటికే ఓడిన కేసులకు సంబంధించిన భూముల్లో జోక్యం చేసుకోవద్దంటూ విచారణను ముగించింది.