డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో వాహనాలను స్వాధీనం చేసుకోవద్దు
ABN , Publish Date - Apr 11 , 2026 | 05:05 AM
పోలీసులు డ్రంకన్ డ్రైవ్ కేసులు పెట్టుకోవచ్చని.. అయితే వాహనాన్ని సీజ్ చేసే అధికారం మాత్రం వారికి లేదని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.
సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు : హైకోర్టు
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): పోలీసులు డ్రంకన్ డ్రైవ్ కేసులు పెట్టుకోవచ్చని.. అయితే వాహనాన్ని సీజ్ చేసే అధికారం మాత్రం వారికి లేదని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలోనే ఇచ్చిన తీర్పును పునరుద్ఘాటించింది. ‘మత్తు లేదా నిషాలో ఉండి వాహనాన్ని నడుపుతూ దొరికిన కేసుల్లో పట్టుబడ్డ వాహనాన్ని తగిన ఆధారాలు అంటే.. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ్ఠగుర్తింపు కార్డు పరిశీలించి వదిలేయాలి. తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ వాహనాన్ని నడిపించడానికి అనుమతించ కూడదు. ఆ వ్యక్తితో మత్తులో లేని, లైసెన్స్ కలిగిన ఇతర వ్యక్తులు ఉంటే వారికి ఆ వాహనం అప్పగించాలి. తాగిన వ్యక్తి తప్ప ఇతరులెవరూ లేకపోతే ఆ వ్యక్తి బంధువులు లేదా స్నేహితులను పిలిచి వారికి అప్పగించాలి. అప్పటికీ ఎవరూ లేకపోతే తాత్కాలికంగా స్థానిక పోలీ్‌సస్టేషన్‌కు తరలించి, సేఫ్ కస్టడీలో ఉంచాలి. కేవలం డ్రైవర్ మత్తులో ఉన్నాడనే కారణంతో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు. వాహనం యజమానిని ప్రాసిక్యూట్ చేయాలని దర్యాప్తు అధికారి భావిస్తే వాహనాన్ని సీజ్ చేసిన మూడురోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలి. తెలంగాణ మోటర్ వెహికిల్ రూల్స్ 1989ను పోలీసులు కచ్చితంగా పాటించాలి’ అని పేర్కొంది.