యూజర్ చార్జీలు సహేతుకంగా ఉండాలి
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:03 AM
బయో మెడికల్ వ్యర్థాల యూజర్ చార్జీలను వ్యతిరేకిస్తూ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
కాలుష్య నియంత్రణ మండళ్లకు హైకోర్టు ఆదేశాలు
ఆసుపత్రుల సంఘం పిటిషన్ డిస్మిస్
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): బయో మెడికల్ వ్యర్థాల యూజర్ చార్జీలను వ్యతిరేకిస్తూ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. అయితే యూజర్ చార్జీల వసూళ్ల వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవి సహేతుకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో పారదర్శకత పాటించాలని తెలిపింది ‘ గైడ్‌లైన్స్ ఫర్ కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ అండ్ డిస్పోజల్ ఫెసిలిటీస్ - 2025’లో భాగంగా వసూలు చేస్తున్న బయోమెడికల్ యూజర్ ఛార్జీల్లో సహేతుకత లేదని పేర్కొంటూ పిటిషన్ దాఖలయింది. పడకల సౌకర్యం కలిగిన ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్క రోజుకు ఒక్క పడక చొప్పున యూజర్ ఛార్జీలను విధిస్తున్నారని, అదే పడకలు లేని ఆసుపత్రులకు మాత్రం వాస్తవంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలపై ఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావుల ధర్మాసనం.. అత్యంత ప్రమాదకరమైన బయో మెడికల్ వ్యర్థాలను చాలా జాగ్రత్తగా ట్రీట్‌మెంట్ చేయడానికి చర్చోపచర్చలు చేసిన తర్వాత జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించారని తెలిపింది. వాటిని కొట్టివేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. అయితే యూజర్ ఛార్జీలను ఎప్పటికప్పుడు సమీక్షించి పారదర్శకంగా ఉండేలా చూడాలని స్పష్టంచేసింది.