Share News

ఒవైసీ విద్యాసంస్థకు ఊరట

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:35 AM

ఒవైసీ సోదరులకు చెందిన ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనంపై యథాతథ స్థితి (స్టేటస్‌ కో) కొనసాగించాలని హైకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.

ఒవైసీ విద్యాసంస్థకు ఊరట

  • భవనం కూల్చివేత యత్నాలపై హైకోర్టు స్టేటస్‌ కో

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఒవైసీ సోదరులకు చెందిన ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనంపై యథాతథ స్థితి (స్టేటస్‌ కో) కొనసాగించాలని హైకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఆ కాలేజీని నిర్వహిస్తున్న సలార్‌ ఏ మిల్లట్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు... ఆ భవనం క్రమబద్ధీకరణ కోసం బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (బీఆర్‌ఎస్‌) కింద దరఖాస్తు పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. ఈ రోజున ఎలా ఉందో అదే స్థితిలో భవనం ఉండాలని పేర్కొంది. ఆ సంస్థ పెట్టుకున్న దరఖాస్తుపై వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, రాజేంద్రనగర్‌ జోనల్‌ కమిషనర్‌, చాంద్రాయణగుట్ట డిప్యూటీ కమిషనర్‌ తదితరులకు నోటీసులు జారీచేసింది. భవనం కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటూ ఆ విద్యా సంస్థను నిర్వహిస్తున్న సలార్‌ ఏ మిల్లట్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు హైకోర్టులో లంచ్‌ మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం వివాదంలో ఉన్న భవనాన్ని రెగ్యులరైజ్‌ చేయాలని 2016లోనే దరఖాస్తు పెట్టుకున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ తరఫున న్యాయవాది రాపర్తి వెంకటేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొన్నారు. ఈ భవనం సల్కం చెరువు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌)లో ఉందన్న విషయమై ఇప్పటికే హైకోర్టులోని మరో ఏక సభ్య ధర్మాసనం వద్ద విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడికే వెళ్లాలని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం యథాతథ స్థితి ఉత్తర్వులు ఇచ్చి తదుపరి విచారణను ఆగస్టు 3కు వాయిదా వేసింది.

Updated Date - Jul 07 , 2026 | 04:35 AM