Share News

తప్పుడు పత్రాలతో భూమి హక్కు కోసం పిటిషన్‌

ABN , Publish Date - Jun 28 , 2026 | 03:55 AM

ఆస్తి రిజిస్ట్రేషన్‌ జరగనప్పటికీ తప్పుడు పత్రాలతో హక్కును పొందడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది.

తప్పుడు పత్రాలతో భూమి హక్కు కోసం పిటిషన్‌

  • రూ.10వేల జరిమానా విధించిన హైకోర్టు

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఆస్తి రిజిస్ట్రేషన్‌ జరగనప్పటికీ తప్పుడు పత్రాలతో హక్కును పొందడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని కొత్త సర్వే నెంబర్‌ 129/56లో తనకు చెందిన 4,865 చదరపు గజాల స్థలంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సయ్యద్‌ అబ్దుల్‌ ఖలీద్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ ధర్మాసనం విచారణ చేపట్టింది. రెవెన్యూశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది స్వేచ్ఛ వాదనలు వినిపిస్తూ.. ఆ భూమి ‘సర్కారీ కంచ తట్టిఖానా’గా రెవెన్యూ రికార్డుల్లో నమోదయిందని, అది ప్రభుత్వ స్వాధీనంలో ఉందని పేర్కొన్నారు. 1969లో ఒరిజినల్‌ పట్టాదారు తనకు విక్రయించినట్లు దొంగ పత్రాలు, రిజిస్ట్రేషన్‌ లేని ఓ ఉర్దూ డాక్యుమెంట్‌ను సృష్టించినట్లు తెలిపారు. ఆ ఉర్దూ డాక్యుమెంట్‌ అనువాద కాపీని ధర్మాసనం పరిశీలించింది. అందులో ఉన్నది రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ కాదని, నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌నకు సంబంధించిన సీరియల్‌ నెంబర్‌ అని గుర్తించింది. దాంతో పిటిషన్‌ను కొట్టివేసింది. దురుద్దేశంతో కోర్టుకు వచ్చినందుకు రూ. 10 వేల జరిమానా విధించింది.

Updated Date - Jun 28 , 2026 | 03:55 AM