Share News

మార్గదర్శకాల కంటే మానవత్వం ముఖ్యం

ABN , Publish Date - May 01 , 2026 | 05:52 AM

చట్టపరమైన మార్గదర్శకాలకు అధికారులు కట్టుబడి ఉండాలని, అదే సమయంలో మానవత్వం కూడా ముఖ్యమని రాష్ట్ర హైకోర్టు తెలిపింది.

మార్గదర్శకాల కంటే మానవత్వం ముఖ్యం

  • రష్యన్‌ మహిళ వీసా పొడిగించాలని హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): చట్టపరమైన మార్గదర్శకాలకు అధికారులు కట్టుబడి ఉండాలని, అదే సమయంలో మానవత్వం కూడా ముఖ్యమని రాష్ట్ర హైకోర్టు తెలిపింది. సంతానంలేని వితంతువుకు వీసా పొడిగింపు మార్గదర్శకాన్ని ప్రస్తావిస్తూ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా నిరాకరించడం ఏకపక్షమని జస్టిస్‌ నగేశ్‌ భీమపాక చెప్పారు. వీసా పొడిగింపు దరఖాస్తును అధికారులు తిరస్కరించడాన్ని రష్యన్‌ మహిళ అలైనా పావ్లోనా, ఆమె అత్త వి.నళిని హైకోర్టులో సవాలు చేశారు. 2024 జులైలో అలైనా భారతీయుడైన స్వరాగును పెళ్లి చేసుకున్నారు. 2025లో ఆమె భర్త మృతి చెందారు. దీంతో భర్త కర్మకాండలు నిర్వహించడంతోపాటు, వృద్ధురాలైన అత్తను చూసుకోవాలని, ఆనారోగ్యంతో ఉన్న తాను రష్యాకు వెళ్లి రావడం కష్టమని, మానవీయ కోణంలో వీసా పొడిగించాలని కోరారు. అయితే దరఖాస్తును అధికారులు తిరస్కరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అధికారుల వాదన సబబే అయినా మానవీయ కోణంలో విచక్షణాధికారాన్ని వినియోగించవచ్చని న్యాయమూర్తి చెప్పారు.

Updated Date - May 01 , 2026 | 05:52 AM