Share News

4 వారాల్లోగా పెన్షన్‌ ప్రయోజనాలు చెల్లించండి

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:13 AM

పెన్షన్‌ ప్రయోజనాల చెల్లింపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టుకు చెందిన ఓ ...

4 వారాల్లోగా పెన్షన్‌ ప్రయోజనాలు చెల్లించండి

  • రంగారెడ్డి జిల్లా కోర్టు మాజీ ఉద్యోగి కేసులో హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): పెన్షన్‌ ప్రయోజనాల చెల్లింపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టుకు చెందిన ఓ మాజీ ఉద్యోగికి చెల్లించాల్సిన పెన్షన్‌ ప్రయోజనాలను మంగళవారం(ఏప్రిల్‌ 21) నుంచి నాలుగు వారాల్లోగా విడుదల చేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో బిల్లుకు సంబంధించిన టోకెన్‌ నెంబర్లు జారీ అయిన తేదీ నుంచి చెల్లింపు చేసే వరకు 18 శాతం వార్షిక వడ్డీని కట్టాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. జస్టిస్‌ పి.సామ్‌కోషి, జస్టిస్‌ నందికొండ నర్సింగరావుతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పని చేసిన విజయ్‌కుమార్‌ ఆరు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. జీపీఎఫ్‌, ఇతర ప్రయోజనాలు కలిపి విజయ్‌కుమార్‌కు రూ.90లక్షల మేర రావాల్సి ఉంది. ఈ సొమ్ము విషయంలో విజయకుమార్‌ తరపున వి.రాజశేఖర్‌రెడ్డి, ఎన్‌.లావణ్య అనే న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీరి వాదనలు విన్న ధర్మాసనం.. విజయ్‌కుమార్‌కు నాలుగు వారాల్లోగా పదవీ విరమణ ప్రయోజనాలను అందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను ఆదేశించింది. సంబంధిత బిల్లులను ఇప్పటికే సమర్పించగా.. నిర్దేశిత గడువులోగా చెల్లింపులు చేయకుంటే.. ఆ బిల్లుల టోకెన్‌ నెంబర్లు జారీ చేసిన తేదీ నుంచి 18 శాతం వార్షిక వడ్డీని చెల్లించాలని న్యాయస్థానం నిర్దేశించింది.

Updated Date - Apr 22 , 2026 | 04:13 AM