Share News

విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేసేలా చూడండి

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:57 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రాలేదనే నెపంతో విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ప్రైవేటు కాలేజీలు అట్టిపెట్టుకోకుండా, ఇచ్చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేసేలా చూడండి

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఫిర్యాదులపై పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రాలేదనే నెపంతో విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను ప్రైవేటు కాలేజీలు అట్టిపెట్టుకోకుండా, ఇచ్చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్ల కోసం మానవ హక్కుల సంఘం, హైకోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో వారి సమస్యలపై ప్రత్యేకంగా వివాద పరిస్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. తమ సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున కచ్చితమైన వివాద పరిష్కార వ్యవస్థ ఉండాలని పేర్కొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సమస్యపై వెనుకబడిన వర్గాలు, ఇస్లామిక్‌ విద్యార్థుల సామాజిక, ఆర్థిక సాధికార సంస్థ (అసీమ్‌) దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ.. ఫీజు బకాయిలు కేవలం మైనార్టీ విద్యార్థుల సమస్య మాత్రమే కాకుండా అన్ని వర్గాలకు సంబంధించినదని తెలిపారు. దీనిపై ఇతర సంక్షేమ శాఖల వాదనలు వినాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. వివిధ సంక్షేమశాఖలను ఇంప్లీడ్‌ చేయాలని పేర్కొంటూ విచారణను మూడువారాలకు వాయిదా వేసింది.

Updated Date - Jun 12 , 2026 | 05:57 AM