సత్వర న్యాయం కోసమే కొత్త కోర్టు భవనాలు
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:59 AM
కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని సౌలభ్యాలతో నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు.
హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్
సిరిసిల్లలో కోర్టు సముదాయానికి శంకుస్థాపన
సిరిసిల్ల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని సౌలభ్యాలతో నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు. సిరిసిల్లలో 12 రకాల న్యాయస్థానాలు ఉండేలా నిర్మించనున్న భవనానికి ఆయన శనివారం భూమి పూజ చేశారు. ఐదెకరాల విస్తీర్ణంలో రూ 81.60 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. సర్వమత ప్రార్థనలు చేసి, శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కోర్టు భవన సముదాయం అన్ని కోర్టుల నిర్వహణకు సరిపోయే విధంగా ఉంటుందని వెల్లడించారు. కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం లభించాలని, ఈ దిశగా న్యాయవాదులు, న్యాయమూర్తులు సమర్థంగా పనిచేయాలని సూచించారు. జిల్లా కోర్టులో 13 వేల పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తి, సిరిసిల్ల జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ మాట్లాడుతూ ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం అందేలా న్యాయవ్యవస్థ పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్, జిల్లా జడ్జి పి.నీరజ, కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్పీ మహేష్ పాల్గొన్నారు.