Share News

High Court: రాజాసాబ్‌ టికెట్‌ ధరల పెంపు మెమో కొట్టివే

ABN , Publish Date - Jan 10 , 2026 | 05:12 AM

రాజాసాబ్‌ సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. సినిమా టికెట్‌ ధరల పెంపునకు అనుమతినిస్తూ తెలంగాణ హోం శాఖ జారీ చేసిన మెమోను న్యాయస్థానం కొట్టేసింది...

High Court: రాజాసాబ్‌ టికెట్‌ ధరల పెంపు మెమో కొట్టివే

  • సినిమా టికెట్‌ ధరలు పెంచమంటూనే మెమోలు ఎలా ఇస్తున్నారు ?:హైకోర్టు

హైదరాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాజాసాబ్‌ సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. సినిమా టికెట్‌ ధరల పెంపునకు అనుమతినిస్తూ తెలంగాణ హోం శాఖ జారీ చేసిన మెమోను న్యాయస్థానం కొట్టేసింది. రాజాసాబ్‌ సినిమా టికెట్‌ ధరల పెంపు మెమోను సవాలు చేస్తూ హైకోర్టులో శుక్రవారం పలు లంచ్‌మోషన్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు సింగిల్‌ జడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ సినిమాకు తెలివిగా మెమోలు జారీ చేస్తున్నారంటూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ సినిమాల టికెట్‌ ధరలను ఎట్టిపరిస్థితుల్లో పెంచబోమని సంబంధిత మంత్రే స్వయంగా చాలాసార్లు ప్రకటించారు. అయినా ఈ మెమోలు ఎలా జారీ అవుతున్నాయి? చాలా తెలివిగా కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు, వారాంతాల్లో మెమోలు జారీ చేస్తున్నారు.ప్రతి సినిమాకు టికెట్‌ ధరలు పెంచుతూ ప్రత్యేకంగా మోమోలు జారీ చేసే బదులు.. సినిమా టికెట్‌ ధరలకు సంబంధించి ఇప్పటికీ అమలులో ఉన్న జీవో 120ని సవరించవచ్చు కదా? సినిమా టికెట్‌ ధరలను నిర్ధారిస్తూ జారీ చేసిన జీవో 120ని కచ్చితంగా పాటించాలని గతంలో ఇదే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పునకు ప్రభుత్వంతోపాటు ఈ హైకోర్టు కూడా కట్టుబడి ఉండాల్సిందే. ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసే వరకు అదే శిరోధార్యం’ అని జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. కాగా, పిటిషనర్ల తరఫున న్యాయవాదులు విజయ్‌గోపాల్‌, శ్రీనివా్‌సరెడ్డి వాదిస్తూ.. ప్రస్తుత మెమో జీవో 120కి, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పునకు విరుద్ధమన్నారు. సినిమా నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, బుక్‌మైషో ప్లాట్‌ ఫాం తరఫున న్యాయవాదులు వాదిస్తూ.. రాజాసాబ్‌ భారీ బడ్జెట్‌ సినిమా అని, వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించిందని, టికెట్‌ ధరల పెంపు వల్ల వచ్చే లాభాల్లో 20 ు మొత్తాన్ని సిని కార్మికుల సంక్షేమ సంఘానికి ఇస్తున్నామని పేర్కొన్నారు. సుదర్శన్‌, విమల్‌ థియేటర్ల యాజమాన్యాల న్యాయవాదులు వాదిస్తూ.. ఇప్పటికే 3 లక్షల వరకు టికెట్లు విక్రయించామని, ఏవైనా ఆదేశాలు ఇస్తే తమకు నష్టమని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం..ప్రస్తుత మెమో జీవో 120, హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పునకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ సస్పెండ్‌ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి మెమోలు ఇవ్వరాదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.


1.jpg

నటుడు నవదీ్‌పపై డ్రగ్స్‌ కేసు కొట్టివేత

సినీ నటుడు నవదీ్‌పపై నమోదైన డ్రగ్స్‌ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నవదీ్‌పకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించనప్పటికీ కేసు కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కిందకే వస్తుందని పేర్కొంది. నాంపల్లి కోర్టులో తనపై విచారణలో ఉన్న మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసును కొట్టేయాలని పేర్కొంటూ నవదీప్‌ దాఖలు చేసిన క్యాష్‌ పిటిషన్‌పై జస్టిస్‌ జే శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వెంకట సిద్ధార్థ వాదిస్తూ.. మూడేళ్ల కింద వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ సిండికేట్‌లో పిటిషనర్‌ను కూడా నిందితుడిగా చేర్చారని.. అయితే పిటిషనర్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ను పోలీసులు గుర్తించలేదని పేర్కొన్నారు. పోలీసుల తరఫున ఏపీపీ జితేందర్‌రావు వాదిస్తూ.. ట్రయల్‌లోనే పిటిషనర్‌ పాత్ర ఏంటో తేలుతుందని.. అప్పటివరకు పిటిషనర్‌పై కేసు కొట్టేయరాదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం..పిటిషనర్‌ వాదనలతో ఏకీభవిస్తూ అతడిపై కేసును కొట్టేస్తూ తుది తీర్పు ప్రకటించింది.

Updated Date - Jan 10 , 2026 | 05:12 AM