క్రిశాంక్‌పై దర్యాప్తునకు హైకోర్టు ఓకే
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:14 AM
సీఎం రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిశా రెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలతో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది
ముందుగా నోటీసు ఇవ్వాలని పోలీసులకు ఆదేశం
సీఎం కుమార్తె మీద సోషల్ మీడియాలో పోస్టుల నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్ నమోదు
అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న
క్రిశాంక్‌విజ్ఞప్తిని నిరాకరించిన కోర్టు
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిశా రెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలతో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై నమోదైన కేసులో పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. క్రిశాంక్‌కు ఈ మేరకు నోటీసులు జారీ చేయాలని తెలిపింది. నైమిశారెడ్డికి పలు ఆస్తులు, ఫార్మా కంపెనీలు ఉన్నాయని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు మెట్టు సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్స్ అండ్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ డీసీపీ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని పేర్కొంటూ క్రిశాంక్ హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. క్రిశాంక్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. తప్పుడు ఆరోపణలతో అందిన ఫిర్యాదును పరిశీలించకుండా పోలీసులు గుడ్డిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం చెల్లదని పేర్కొన్నారు. సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు రెండు రోజుల నుంచి పిటిషనర్‌ను అనుసరిస్తున్నారని.. అతడి ఇంటి పరిసరాల్లో ఉంటున్నారన్నారు. పిటిషనర్‌ను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే వాదిస్తూ.. సోమవారం నాడే ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యిందని, అప్పుడే పిటిషనర్ ఎందుకు తొందరపడుతున్నారని ప్రశ్నించారు. దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నందున ఇప్పుడే ఎలాంటి ఉపశమన ఉత్తర్వులు ఇవ్వరాదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌కు వ్యతిరేకంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు చేసుకోవచ్చని, నోటీసు జారీ చేయాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు పాటించాలని పేర్కొంటూ విచారణను ముగించింది.