Share News

రాష్ట్రంలో పలు చోట్ల వర్షం

ABN , Publish Date - Jul 22 , 2026 | 06:35 AM

కొన్నాళ్లుగా మబ్బు పట్టినా కురవని మేఘం కాస్త వర్షించింది! కొన్నాళ్లుగా చినుకు కోసం ఆకాశం వైపు చూస్తున్న అన్నదాత మనసు కాస్త ఊరట చెందింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పలుచోట్ల వర్షాలు పడ్డాయి.

రాష్ట్రంలో పలు చోట్ల వర్షం

  • రైతులకు ఊరట.. వరి, పత్తి పంటలకు ప్రాణం

  • ములుగు జిల్లా వాజేడులో 11.26 సెం.మీ

  • పొంగిపొర్లుతున్న బొగత జలపాతం

  • నిండిన తాలిపేరు ప్రాజెక్టు

  • సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

కొన్నాళ్లుగా మబ్బు పట్టినా కురవని మేఘం కాస్త వర్షించింది! కొన్నాళ్లుగా చినుకు కోసం ఆకాశం వైపు చూస్తున్న అన్నదాత మనసు కాస్త ఊరట చెందింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పలుచోట్ల వర్షాలు పడ్డాయి. నీళ్లు లేక వాడు ముఖం పట్టిన వరినాట్లు, పత్తి మొలకలకు, మక్క, పెసర, కూరగాయాల పంటలకు జీవం వచ్చింది. ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో పొలంగట్లు పొంగిపొర్లే స్థాయిలో వర్షం పడింది. ఖమ్మం, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, మంగళవారం వర్షం కురిసింది. కొత్తగూడెం, కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాల్లో చిరుజల్లులు పడ్డాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని దొడ్ల, మల్యాల వద్ద ఉన్న తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఫలితంగా కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీలకు రాకపోకలు నిలిచిపోయాయి. బాలాజీ బంధ-ఎలిశెట్టిపల్లి మధ్య వాగు పొంగడంతో ఎలిశెట్టిపల్లికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వాజేడు మండలం గొల్లగూడెం, చీకుపల్లి మద్యలో ఏర్పాటు చేసిన ఇసుక వాగు వంతెన అప్రోచ్‌ రోడ్డుకు గండి పడింది. కన్నాయిగూడెంలో గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్‌ ప్రహరీ గేటు కూలిపోయింది. బొగత జలపాతం ఉప్పొంగుతోంది. వర్షం కారణంగా సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో ఇందారం, రామకృష్ణాపూర్‌, మందమర్రి, గోలేటి, కైరిగూడ ఓపీల్లో ఒక్కరోజులోనే 32 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది.


ఎగువన ఛత్తీస్‌గఢ్ లో వర్షాలు, వరదలతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం అధికారులు 25 గేట్లలో 15 గేట్లు ఎత్తి 11వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ములుగు జిల్లాలోని వాజేడు 11.26 సెం.మీ, వెంకటాపురంలో 11.06 సెం.మీ, వెంకటాపూర్‌లో 10.88 సెం.మీ, మల్లంపల్లిలో 8.18 సెం.మీ, గోవిందరావుపేటలో 7.28 సెం.మీ, ములుగులో 5.24 సెం.మీ, తాడ్వాయిలో 5.22 సెం.మీ, మంగపేట మండలంలో 5 సెంమీ వర్షపాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లా పలిమెలలో 8.36 సెం.మీ, గణపురంలో 6.84 సెం.మీ, మహదేవ్‌పూర్‌లో 6.48 సెం.మీ, భూపాలపల్లిలో 5.14 సెం.మీ, కాటారంలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం రూరల్‌లో 5.6 సెం.మీ, వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 7.2 సెం.మీ, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 9.2 సెం.మీ ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బనలో 8.3 సెం,మీ, తిర్యాణిలో 8.85 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Updated Date - Jul 22 , 2026 | 06:38 AM